హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి పాలకులు కులవృత్తులను ధ్వంసం చేస్తే.. తెలంగాణలో సీఎం కేసీఆర్ వాటికి జీవం పోశారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పష్టంచేశారు. అసెంబ్లీలో ఎక్సైజ్, పర్యాటకం, సాంస్కృతిక, యువజన శాఖల గురించి సభ్యు లు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. గీత కార్మికులకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేందుకు 12 కోట్లతో నీరా కేఫ్‌ను ఏర్పా టు చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా ల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉన్నదన్నారు. గీత కార్మికులకు బైకులిచ్చే ఆలోచన ప్రభుత్వానికి ఉన్నదని తెలిపారు.
వరల్డ్ టూరిజం హబ్‌గా తెలంగాణ మారిందన్నారు. రామప్పకు తొలి ప్రయత్నంలోనే వరల్డ్ హెరిటేజ్ హోదా దక్కేలా సీఎం కేసీఆర్ కృషి చేసినట్టు చెప్పారు. పోచంపల్లికి బెస్ట్ విలేజ్ అవార్డు వచ్చిందని గుర్తుచేశారు. యువజన సర్వీసుల శాఖ ద్వారా 16 జాబ్‌మేళాలు నిర్వహించి, 21,949 మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. రాష్ట్రంలో క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు సీఎం కేసీఆర్ కంకణం కట్టుకొన్నారని పేర్కొన్నారు. ఇప్పటివరకూ 46 స్టేడియాల నిర్మాణాలు పూర్తిచేసినట్టు చెప్పారు. 19,472 గ్రామాలకు ప్రభుత్వం క్రీడామైదానాలను మంజూరు చేస్తే.. 12,542 గ్రామాల్లో వాటిని పూర్తి చేశామని వెల్లడించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇన్ని క్రీడా మైదానాలు లేవని పేర్కొన్నారు.