హైదరాబాద్ : హరితహారంలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా 4 కోట్ల 6 వేల తాటి, ఈత మొక్కలను నాటామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. శాసనసభలో మాట్లాడిన మంత్రి శ్రీనివాస్ గౌడ్.. గీత వృత్తి కోసం తెలంగాణ ప్రభుత్వం చేసిన కృషిని కొనియాడారు.
కల్లు ఆయుర్వేద డ్రింక్. నీరా చాలా గొప్ప పానీయం. అన్ని కుల వృత్తుల మీద సీఎం కేసీఆర్కు అవగాహన ఉంది. గీత కార్మికులు చనిపోతే 5 లక్షల ఎక్స్గ్రేషియా ఐదు రోజుల్లో అందించేందుకు కృషి చేస్తున్నాం. గీత కార్మికుల సంక్షేమం కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నాం. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బకాయిలన్నీ మాఫీ చేసినం. తెలంగాణ వచ్చాక గీత వృత్తి కార్మికులను అన్ని రకాలుగా ఆదుకుంటున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా వైన్ షాపుల్లో గౌడ కులస్తులకు రిజర్వేషన్లు కల్పించినం. గత పాలకులు కల్లు గీత వృత్తిని అవమానించారు. ఆర్థికంగా నిలదొక్కుకోకుండా అడ్డుకున్నారు. గత పాలకులు గౌడ వృత్తిని అభివృద్ధి చేయాలని ఎప్పుడూ చూడలేదు.. అని శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు.