Srinivas Goud | హన్వాడ : స్వయం పాలనలో గిరిజనులు అభివృద్ధి సాధించారని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలం ఏనేమీది తండాలో గిరిజన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. రూ.10 లక్షలతో నిర్మించనున్న సేవాలాల్ భవనానికి శంకుస్థాపన, రూ.10 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్లను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 500 జనాభా ఉన్న తండాలను ప్రత్యేక గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేశామన్నారు. జనాభాకు అనుగుణంగా ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచామన్నారు. గిరిజనులకు త్వరలోనే పోడుభూమి పట్టాలు అందజేస్తామన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ద్వారా చెరువులు, కుంటలను త్వరలోనే నింపుతామన్నారు. కులాల పేరుతో గ్రామాలకు వస్తున్న పగటి వేషగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ రవినాయక్, ఎంపీపీ బాలరాజు, జడ్పీటీసీ విజయనిర్మల, వైస్ ఎంపీపీ లక్ష్మి, సింగిల్ విండో చైర్మన్ వెంకటయ్య, వైస్ చైర్మన్ కృష్ణయ్యగౌడ్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు రాజయ్యగౌడ్, నాయకులు రమణారెడ్డి, లక్ష్మయ్య, జంబులయ్య, పెంట్యానాయక్, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.