హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గతంలో మాదిరిగా బార్ అండ్ రెస్టారెంట్ల యజమానులకు వేధింపులు లేవని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఖైరతాబాద్‌లోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య హాల్లో తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ యాజమానుల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారుల నిరంతర కృషి వల్ల రాష్ట్రంలో నకిలీ మద్యం నియంత్రణలో ఉందన్నారు.
అలాగే ఇతర రాష్ట్రాల నుంచి తరలివస్తున్న అక్రమ మద్యాన్ని నివారించడం వల్లే నేడు ఎక్సైజ్ శాఖ ఆదాయం పెరిగిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో బార్ అండ్ రెస్టారెంట్ యజమానుల పై ఎన్నో వేధింపులు ఉండేవన్నారు. బార్ అండ్ రెస్టారెంట్ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కారం చేస్తున్నామన్నాని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బేవరేజ్ కార్పొరేషన్ ద్వారా నిర్వహించే గోదాముల ద్వారానే మద్యం కొనుగోళ్లు జరుపాలని మంత్రి సూచించారు.
నకిలీ మద్యాన్ని అమ్మే వారిపై కఠిన చర్యలు చేపడతామన్నారు. అక్రమ మద్యం అమ్మే వారిపై అవసరమైతే PD Act కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ చేసిన విజ్ఞప్తి మేరకు బార్లలో క్వార్టర్, హాఫ్ బాటిల్స్‌తో పాటు ఫుల్ బాటిల్స్‌ను అమ్ముకునేలా అనుమతి ఇచ్చామన్నారు. బార్ అండ్ రెస్టారెంట్ యజమానులు ప్రభుత్వం సూచించిన నిబంధన మేరకు నడుపుకోవాలని సూచించారు.
అనంతరం అసోసియేషన్ వారు మంత్రిని గజమాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జి. దామోదర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి జైపాల్ రెడ్డి, గౌరవ సలహాదారులు బాలగోని బాలరాజ్ గౌడ్, చక్రపాణి, ఉపాధ్యక్షులు రామకృష్ణ, పి రాజు గౌడ్, మాజీ అధ్యక్షుడు మనోహర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్ కూరెళ్ల వేములయ్య గౌడ్, అనిల్ కుమార్ గౌడ్, పవన్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.