మహబూబ్నగర్ : క్రమశిక్షణ గల పార్టీ బీఆర్ఎస్. ఏ పార్టీకి లేనంత మంది కార్యకర్తలున్న బీఆర్ఎస్కు ఉన్నారు. మా బలం, బలగం బీఆర్ఎస్ సైన్యమే..కార్యకర్తలు సైనికుల వలే క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం ఎంతో కృషి చేస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Minister Srinivas Goud) అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గంలోని బీఆర్ఎస్ పార్టీ బూత్ ఇన్చార్జీల సమావేశంలో ఆయన మాట్లాడారు.
బీఆర్ఎస్ పార్టీ అంటేనే అభివృద్ధికి చిరునామా అని, గత పదేళ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధినే తమను మరోసారి భారీ విజయం సాధించేలా చేస్తుందని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో మనం చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని మరింత విస్తృతంగా ప్రజలకు తెలిసేలా చేయాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు సూచించారు. క్షేత్ర స్థాయిలో మిగతా పార్టీలకు కనీసం ఏజెంట్లు కూడా దొరకని పరిస్థితి ఉందన్నారు.
అయినప్పటికీ పోలింగ్ వరకు పార్టీ కేడర్ అప్రమత్తంగా ఉండాలన్నారు. కనీసం ఎన్నికలప్పుడు మాత్రమే వచ్చి నెల, రెండు నెలలు మాత్రమే ఉండి వెళ్లే గెస్ట్ క్యారెక్టర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రతి పక్షాల వైఖరిని ఎప్పటికప్పుడు తెలియజేయాలన్నారు. మనకు ప్రజాబలం బలంగా ఉందని, అది త్వరలో జరిగే ఎన్నికల్లో మరింత స్పష్టంగా వెల్లడవుతుందన్నారు. కార్యకర్తలు నవంబర్ 30వ తేదీ వరకు అప్రమత్తంగా ఉండి ఎన్నికలను విజయవంతం చేయాలని మంత్రి సూచించారు.