నారాయణపేట : ఎగువన ఆల్మట్టి నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి భారీగా వరద నీటిని వదిలిన నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ( Minister Srinivas Goud ) , ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి కోరారు. శుక్రవారం నారాయణపేట జిల్లా మక్తల్ మండలం పసువుల వద్ద కృష్ణానది వరద దృశ్యాన్ని వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. నది తీర ప్రాంతం వద్ద ప్రజలు మదిలోకి వెళ్లకుండా నిరంతరం పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి ప్రస్తుతం సుమారు 1.70 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువనకు వదులుతున్నారని పేర్కొన్నారు. ఎగువ నుంచి వస్తున్న వరద పరిస్థితిపై కర్ణాటకలోని బీజాపూర్ కలెక్టర్ తో నారాయణపేట కలెక్టర్ నిరంతరం మాట్లాడుతున్నారని వెల్లడించారు. వరద (Flood) ఉధృతి తగ్గేవరకు కర్ణాటక దత్త పీఠానికి బోట్ ప్రయాణం ఆపాలని అధికారులకు ఆదేశించారు.
గతంలో పడవ మునిగి నలుగురు మృతి చెందిన ఘటన ఇప్పటికీ ఈ ప్రాంత వాసులను భయాందోళనకు గురి చేస్తున్నదని అన్నారు. పసుపుల నుంచి దత్తపీఠం (Datta Pitam) వెళ్లే భక్తులు తప్పనిసరిగా వరద ఉధృతి తగ్గేవరకు నదిలో ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని కోరారు. భవిష్యత్తులో పడవ ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు స్థానిక బోట్ నిర్వాహకులకు నాగార్జునసాగర్ లో శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు.
కృష్ణానది వరద ఉధృతిపై అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. కృష్ణ నది పరివాహక గ్రామాల వద్ద ప్రజలు ఎవరు నదిలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా వరదల పరిస్థితిని సమీక్షించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం సమీక్షిస్తున్నారని వెల్లడించారు. వారి వెంట జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ సత్యనారాయణ, అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులున్నారు.