Minister Srinivas Goud | జర్మనీ (Germany) రాజధాని బెర్లిన్ (Berlin)లోని ఐటీబీ బెర్లిన్ ఇంటర్నేషనల్ టూరిజం అండ్ కల్చర్ ఎగ్జిబిషన్ (World Tourism Exhibition)లో తెలంగాణ టూరిజం (Telangana Tourism) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్‌ను రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ (Minister Srinivas Goud) ప్రారంభించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు.. రాష్ట్రంలోని టూరిజం ప్రాంతాల విశిష్టతను తెలిపేలా.. అంతర్జాతీయ టూరిజం అండ్ కల్చర్ ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు. యునెస్కో గుర్తింపు పొందిన ప్రపంచ వారసత్వ సంపద రామప్ప దేవాలయం, బుద్ధవనం, తెలంగాణలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలను ప్రదర్శించారు.
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ జర్మనీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను తెలంగాణ టూరిజం స్టాల్ వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ బెర్లిన్‌లోని ఇంటర్నేషనల్ టూరిజం అండ్ కల్చర్ ఎగ్జిబిషన్లో తెలంగాణ టూరిజం స్టాల్ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుందన్నారు. ఎగ్జిబిషన్లో 180 దేశాలకు చెందిన పర్యాటక, సాంస్కృతిక సంస్థలు పాల్గొంటున్నాయని మంత్రి తెలిపారు. తెలంగాణలో ప్రపంచ స్థాయి పర్యాటక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయని, వాటికి సరైన ప్రమోషన్‌ను కల్పిస్తూ ద్వారా తెలంగాణకు విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నామన్నారు.
రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ పర్యాటక పూర్వవైభవాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇప్పటికే పలు ప్రపంచ స్థాయి వేదికలపై తెలంగాణ టూరిజం ప్రమోషన్‌ను నిర్వహించామన్నారు. తెలంగాణ రాష్ట్రం టూరిజం హబ్‌గా ఇప్పటికే పలు టూరిజం సంస్థలు గుర్తించి అవార్డులు అందిస్తున్నాయన్నారు. కార్యక్రమంలో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్, జర్మనీలోని భారత రాయబారి పర్వతనేని హరీశ్ రావు, ఇండియా టూరిజం సెక్రెటరీ అరవింద్ సింగ్, తెలంగాణ టూరిజం ఎండీ మనోహర్, జర్మనీలోని తెలంగాణ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ రఘు తదితరులు పాల్గొన్నారు.