Srinivas Goud | మహబూబ్నగర్ : వ్యవసాయ పనిముట్లు తయారు చేయడంలో ఎరుకలి వారి పాత్ర ఎంతో గొప్పదని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ, గ్రీన్ బెల్ట్ వద్ద ఏర్పాటు చేసిన ఏకలవ్య విగ్రహాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. కులవృత్తులన్నీ ఒక కుటుంబం నుంచి కులాలు, ఉప కులాలుగా విస్తరించాయన్నారు. కులవృత్తులకు ఆదరణ లేక ఉపాధి కోల్పోయిన దశలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ అందరికీ అండగా నిలిచారు. సమైక్య రాష్ట్రంలో 1956లోనే తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం పేరిట సంఘాన్ని ఏర్పాటు చేసిన ఘనత మనది అని తెలిపారు. ఎస్టీల కోసం అనేక గురుకులాలు, వసతి గృహాలు ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు.
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఎరుకల ఆత్మ గౌరవ భవనం కోసం ఎకరా భూమితో పాటు రూ.30 లక్షల నిధులను అందిస్తున్నామని మంత్రి తెలిపారు. ట్యాంక్ బండ్ మీద ఏకలవ్యుడి విగ్రహం, హైదరాబాద్ నగరంలో ఆత్మ గౌరవ భవనం నిర్మాణానికి ఎకరా భూమి, రూ.3.5 కోట్ల నిధులను అందించామని గుర్తు చేశారు. ప్రపంచ చరిత్రలో అనేక పోరాటాలు, ఉద్యమాలు, త్యాగాలకు నిలయం తెలంగాణ అని పేర్కొన్నారు. పోరాటయోధులు, మహనీయులను గుర్తించి ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోయేలా మహోన్నతమైన స్థానాన్ని తెలంగాణ సర్కారు ఇచ్చిందన్నారు. తెలంగాణ వైతాళికులు, మహనీయుల విగ్రహాలను పద్మావతి కాలనీ గ్రీన్ బెల్టు వద్ద ఎంతో గొప్పగా ఏర్పాటు చేసుకున్నామని కొనియాడారు. ఎరుకల సంఘం నాయకుడు కుర్రా సత్యనారాయణకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించిన ఘనత ఈ ప్రభుత్వానిది అని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు గోపాల్ యాదవ్, ముడా చైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ చైర్మన్ కేసి నర్సింహులు, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్, మున్సిపల్ డిఫ్యూటీ ఫ్లోర్ లీడర్ కట్టా రవికిషన్ రెడ్డి, కూకట్ పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కుతాడి రాములు, రాష్ట్ర ఎరుకల సంఘం గౌరవ అధ్యక్షుడు బాలయ్య, రాష్ట్ర అధ్యక్షుడు పొన్నకల్ కృష్ణయ్య, జిల్లా అధ్యక్షుడు తిరుమలరాజు, నాయకులు లక్ష్మణ్, రామకృష్ణ, మాల్యాద్రి, తదితరులు పాల్గొన్నారు.