మహబూబ్‌నగర్ అర్బన్, అక్టోబర్ 22: రాష్ట్రంలో బీఆర్ఎస్కు ఎంతో బలగం ఉన్నదని.. ఈ ఎన్నికల్లో గులాబీ పార్టీదే హవా కొనసాగుతుందని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పష్టం చేశారు. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో నియోజకర్గ బీఆర్ఎస్ బూత్ ఇన్‌చార్జీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఏ పార్టీకి లేనంత మంది కార్యకర్తలున్న పార్టీ బీఆర్ఎస్ అని పేర్కొన్నారు.
ఎన్నికలు ముగిసే వరకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి బీఆర్ఎస్కు భారీ మెజార్టీని అందించే దిశగా కృషి చేయాలని సూచించారు. బీఆర్ఎస్ అంటేనే అభివృద్ధికి చిరునామా అని.. పదేండ్లలో మహబూబ్‌నగర్‌లో జరిగిన పనులే ఇందుకు నిదర్శనమని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే ప్రజల వద్దకు వచ్చే పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.