సంస్థాన్ నారాయణపురం, అక్టోబర్ 26: స్వదేశీ కల్లును కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం నిషేధించడం అన్యాయమని ఎక్సైజ్‌శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కర్ణాటకలో ఈడిగల పేరిట కల్లు గీత వృత్తిగా ఉన్న గౌడ కులస్థులకు బీజేపీ సర్కారు తీరని అన్యా యం చేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. యాద్రాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురంలోని రాఘవేంద్ర గార్డెన్స్‌లో బుధవారం నిర్వహించిన గౌడ కులస్థుల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌తో కలిసి మంత్రులు మాట్లాడారు.
కర్ణాటక, గుజరాత్లో కల్లును నిషేధించిన వాళ్లు పొరపాటున తెలంగాణలో గెలిస్తే ఇక్కడ కూడా కల్లు గీత కార్మికుల పొట్ట కొడుతారని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ బహుజన సామాజిక వర్గాల విముక్తి కోసం పోరాడిన సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. గౌడ కులస్థుల చెట్టు పన్నును ప్రభుత్వం పూర్తిగా ఎత్తివేసిందన్నారు. రూ.16 కోట్ల బకాయిలు రద్దు చేసినట్లు వెల్లడించారు. గౌడ కార్మికులకు పింఛన్లు, రూ.5 లక్షల బీమా, తదితర సౌకర్యాలు కల్పించి వారి వృత్తిని కాపాడుతున్నామని చెప్పారు. కర్ణాటకలో కల్లును నిషేధించడంపై తమ ప్రసంగం విని కర్ణాటక నారాయణ గురు శక్తి పీఠాధిపతి, ఆర్య ఈడిగ రాష్ట్రీయ మహామండలి జాతీయ అధ్యక్షుడు ప్రణవానంద స్వామీజీ ఇక్కడికి వచ్చినట్టు పేర్కొన్నారు. ఫారిన్ లిక్కర్‌కు స్వాగతం చెబుతున్న కేంద్రంలోని బీజేపీ సర్కారు.. కల్లును మాత్రం నిషేధించి కర్ణాటకలోని గౌడ కులస్థులకు తీవ్ర అన్యాయం చేసిందని దుయ్యబట్టారు.
ఇక్కడా అన్ని విధాలా ఆదుకుంటున్నారు
కర్ణాటకలో కల్లును నిషేధించి కులవృత్తే లేకుండా కర్ణాటక ప్రభుత్వం అన్యాయం చేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇక్కడి గౌడ కులస్థులను అన్నివిధాలా అండగా ఉంటున్నదని కర్ణాటక నారాయణగురు శక్తి పీఠాధిపతి, ఆర్య ఈడిగ రాష్ట్రీయ మహామండలి జాతీయ అధ్యక్షుడు ప్రణవానంద స్వామీజీ అన్నారు. కర్ణాటకలో కల్లును నిషేధించి రేణుక ఎల్లమ్మ దేవికి నైవేద్యం లేకుండా చేశారని, తమ సామాజిక వర్గానికి చెందిన కులవృత్తి గుర్తింపును కనుమరుగు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
కర్ణాటక ప్రభుత్వం తీరుకు నిరసనగా మంగళూరు నుంచి బెంగళూరు వరకు 658 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నట్టు ఆయన తెలిపారు. కులవృత్తులను కాపాడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా ఉండాలని ప్రజలకు స్వామీజీ విజ్ఞప్తి చేశారు. కాగా, కర్ణాటకలో గౌడ సమస్యలపై స్వామీజీ చేసే పాదయాత్రకు తెలంగాణ గౌడ కులస్తులు వెళ్లి సంఘీభావం తెలుపనున్నట్టు స్థానిక గౌడ కులస్థులు స్వామీజీకి తెలిపారు. కార్యక్రమం లో ఎంపీపీ గుత్తా ఉమాదేవి, సర్పంచ్ శ్రీహ రి, జడ్పీటీసీ వీరమల్ల భానుమతి, ఎంపీటీసీ బచ్చన గొని గాలయ్య, గౌడ సంఘం నాయకులు పాలకొల్లు యాదయ్య గౌడ్, గంగాపురం శ్రీరాములు గౌడ్, నీళ్ల నరసింహాగౌడ్, నీళ్ల గాలయ్య గౌడ్, మోగుదాల సత్తయ్య గౌడ్, పందుల యాదగిరి గౌడ్ పాల్గొన్నారు.