మహబూబ్‌నగర్, మే 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పాదయాత్ర పేరిట మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెచ్చగొట్టే మాటలతో మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. మతం పేరిట అభంశుభం తెలియని యువతను తప్పుదారి పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో హన్వాడ మండలంలోని ఇబ్రహీంబాగ్, మునిమోక్షం, దాచేపల్లి గ్రామాలకు చెందిన 600 మంది బీజేపీ, కాం గ్రెస్ నాయకులు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చి మోసం చేశారని గుర్తుచేశారు. ఇప్పుడేమో పాదయాత్ర పేరిట షో చేస్తున్న బండికి జాతీయ హోదాపై మాట్లాడే దమ్ము లేదన్నారు. దేశవ్యాప్తంగా విద్యుత్తును ప్రైవేటుపరం చేసి రైతుల నడ్డి విరిచేందుకు కేంద్రం సిద్ధమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ ప్రధాని ఉన్నా బీసీల కోసం ఓ శాఖను ఏర్పాటు చేయలేని చేతగాని ప్రభుత్వమని బీజేపీపై మండిపడ్డారు.