మహబూబ్ నగర్ : కేంద్రంలోని మోదీ సర్కారు తీరు చూస్తుంటే భవిష్యత్తులో పీల్చే గాలి పైన కూడా జీఎస్టీ వేస్తారేమోనని భయంగా ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వాపోయారు. పసిపిల్లలు తాగే పాల పైన కూడా జీఎస్టీ విధించిన తీరు చూస్తుంటే మోదీ ప్రభుత్వం భవిష్యత్తులో ఎలాంటి పన్నులు విధిస్తుందో అర్థం కాకుండా ఉందని ఆయన అన్నారు. పాలు, పాల పదార్థాలపై జీఎస్టీ విధించిన కేంద్రం తీరుకు నిరసనగా మహబూబ్ నగర్ తెలంగాణ చౌరస్తాలో టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు… పాడి రైతులు, మహిళల ఆధ్వర్యంలో జరిగిన ఆందోళన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన తర్వాత సాగునీరు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందించడంతో వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలు కూడా ఎంతో సమృద్ధి సాధించాయన్నారు. ఇప్పుడిప్పుడే బాగుపడుతున్న పాడి రైతుపై కేంద్రం దుర్మార్గంగా పన్నుల భారం మోపడం అన్యాయమన్నారు. రైతుల ఆదాయానికి అత్యంత కీలకమైన పాలు మరియు పాల ఉత్పత్తుల పైన పన్ను విధించడం వల్ల ఈ రంగంపై పూర్తి ప్రభావం పడుతుందని వాపోయారు.
ఓవైపు పాడి రైతుపై భారం వేస్తూనే, పాలు పాల ఉత్పత్తులపై జీఎస్టీ విధించడం ద్వారా సామాన్యుడు ఎలా బతకాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. దేశంలోని ప్రజలు బతకాల వద్దా… అని ప్రధాని మోదీని ప్రశ్నించారు. దళిత బంధు ద్వారా ఎందరో పేద దళితులకు పాడి పరిశ్రమ యూనిట్లను అందించామని అందులో భాగంగా హర్యానా, పంజాబ్, ఏపీ వంటి రాష్ట్రాల నుంచి కూడా బర్రెలను తీసుకువచ్చి వాటి పోషణ ద్వారా ఉపాధి పొందుతున్నారని… పాలపై జీఎస్టీ విధించడంతో వీరందరి పైన భారం పడుతుందని తెలిపారు.
పాలపై జీఎస్టీ విధింపునకు నిరసనగా అనేకమంది రైతులు పట్టణంలో విక్రయించడానికి తీసుకు వచ్చిన పాలను పారబోసి తమ నిరసన తెలిపారని… భవిష్యత్తులో ఈ అంశంపై కేంద్రం తీరును ఎండగడతామని మంత్రి హెచ్చరించారు. పాలు పాల ఉత్పత్తులపై జిఎస్టి రద్దు చేయాలని లేకుంటే ఆందోళన కొనసాగుతుందని తెలిపారు.
ఈ నిరసన కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు గోపాల్ యాదవ్, గ్రంథాలయాల సంస్థ జిల్లా అధ్యక్షుడు రాజేశ్వర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రెహమాన్, జడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, ఎంపీపీలు జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, పాడి రైతులు, పాల ఉత్పత్తిదారుల సంఘం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.