అవి రెండూ స్వచ్ఛమైన తెలంగాణ సినిమాలు. తెలంగాణపై ఏమాత్రం ప్రేమ ఉన్నవారైనా ఆ రెండు సినిమాలు చూసితీరాల్సిందే. ఈ రెండు చిత్రాలు తెలుగు సినిమా చరిత్రలో నమోదు కాకున్నా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అవే..అంకుర్, నిశాంత్. తెలంగాణలో భూస్వామ్యం రాజ్యమేలుతున్న కాలం నేపథ్యంగా తీసిన ఈ సినిమాలివి. అణగారిన వర్గాలపై దాష్టీకాలు, అరాచకాలపై తిరుగుబాట్లను ఇవి కండ్లకు కట్టాయి. తెలంగాణ చరిత్రపుటల్లో ఈ రెండు సినిమాల స్థానం ప్రత్యేకం.
ఈ రెండు సినిమాలూ ఇరవయ్యో శతాబ్దం డబ్బు దశకం మొదట్లో తీశారు. మన హైదరాబాద్ టాకీసుల్ల విడుదల అయ్యి, వంద రోజులు ఆడినయ్! రెండూ తెలంగాణ చరిత్రను ఆధారం చేసుకున్నవే! 1974లో వచ్చింది మొదటి సినిమా. మరుసటి సాలు మరోటి. చరిత్రలో జరిగిన దుర్మార్గపు కాలాల గురించిన కథలు ఎందుకు చెప్పుకోవాలే? మళ్ల అవి పునరావృతం కాకూడదనే కదా! ఆ కాలాన కాలరాయబడ్డ బతుకులు మళ్ల చిగురిస్తే కాపాడాల్సిన ఇంగితం చెబుతయి ఆ కథలు.

హైదరాబాద్ చరిత్ర మీద ఇసువంతైన ప్రేమ ఉంటే ఈ సినిమాలు చూడాల్సిందే. తెలుగు సినిమా చరిత్రల నమోదు కాని తెలుగు కథలు ఈ రెండు సినిమాలు (సినిమా గూడంగ ఒక సాహిత్య రచననే అననీకి ఒక రుజువు ఈ సినిమాలు).
మొదటి సినిమా పేరు అంకుర్ (1974). ఈ సినిమాల ఆర్టిస్టులంత కొత్తోండ్లే. కథ మాత్రం 1946ది. ఆ దరిదాపులది అనుకుందామ్. ఈ సినిమా తర్వాత ఆయన తీసిన రెండవ సినిమా భూస్వామ్యం మీద తెలంగాణ రైతుల తిరుగుబాటు నేపథ్యం.
తెలంగాణల భూస్వామ్యం రాజ్యం ఏలుతున్నది. లక్ష్మి ఓ రైతు భార్య. తక్కువ కులం. అంతే నమోదైన సత్యం. ఆమె మొగుడు కిష్టయ్య మూగ, చెవిటి. లక్ష్మి కోరికల్లా తన కడపున ఓ కాయ కాయాలనే! ఆ అంగవైల్యం సింబాలిక్ అనిపిస్తది. ఆ మొగుడికి సంపాదన లేదు. తాగుబోతు. (మిగిలినవి అన్నీ ఉన్నయ్!).
సూర్య దొర కొడుకు. అప్పుడే హైద్రాబాద్ల చదువు పూర్తి చేసుకుని ఊరొచ్చిండు. సూర్యకి సమర్తాడని ఒక భార్య. కాపురానికి ఇప్పుడే అప్పుడే రాదు.
వోని భాగం భూమి వాడికుందీ. చేసుకుంటున్నడు. లక్ష్మి, కిష్టయ్య ఆ చిన్న దొర దగ్గర పనిచేస్తున్నరు. వాడు చిన్నాచితకా పని. లక్ష్మి ఇంటి పని. సంసారం నడుస్తుంది. తాటి చెట్టెక్కి కల్లు దొంగిలించినందుకు కిష్టయ్యకి తలొంచుకునే శిక్ష పడింది. గుండు చేసి గాడిద మీద ఊరేగించిన్రు. వాడు ఊరొదిలి పారిపోయాడు.
సూర్య.. లక్ష్మిని లోబర్చుకున్నడు. ఆమె అలా జరగనిచ్చింది. లక్ష్మి నెల తప్పింది. సూర్య భార్య కాపురానికి వచ్చింది. లక్ష్మికి నెలలు నిండినయి. కిష్టయ్య తిరిగొచ్చిండు. పట్నం పోయీ డబ్బులు సంపాదించి మరీ వచ్చిండు. సూర్య నిజంగ చూస్తే ఓ భూస్వామ్య సమాజానికి ఒక ప్రతీక. వాడి తండ్రి చేసిందే, వాడూ చేశాడు.ఈ సినిమాల దొరతనం ఉన్నది. మామూలు మనిషి అసహాయతా ఉన్నది. భూస్వామ్యంల స్త్రీ, పురుష సంబంధాల మీద స్టడీ ఉంది. (శ్యామ్ బెనగల్ సినిమాల్ల స్త్రీల, పురుష సంబంధం మీద మంచి స్టడీ ఉంటది).
భూస్వామ్య అహంకారంతోని సూర్య.. లక్ష్మి, కిష్ట య్య జీవితాలతోని ఆడుకున్నా కానీ వాడు స్వతహాగా భయస్తుడు. సినిమా చివరికి తన మీదికి వచ్చిన కిష్ట య్య ప్రతీకార వాంఛతో వచ్చాడని అనుకున్నాడు. వాడి ని చితక్కొట్టిండు. లక్ష్మి అడ్డుపడకపోతే చంపేసి ఉండు! లక్ష్మికి మొగుడంటే వల్లమాలిన ప్రేమ. భూస్వామ్య స మాజంల బడుగు బతుకేందో తెలిసిన మనిషి. అయినా, సూర్య మీద తిరగబడ్డది. మొగుడిని కాపాడుకున్నది.
ఆ తర్వాత ఆ భూస్వామి ఇంటి మీద రాయి విసిరిన పిల్లవాడు ఆ తిరుగుబాటుకు మరో రూపం. నిజంగ చూస్తే ఈ సినిమా ఆ చివరి షాటే! కమర్షియల్ సినిమా మార్కెట్ మధ్య నిలబడ్ద కళాకృతి. ఆ టేకింగ్ అలాంటి కథ భారతీయ సినిమా ఇదివరకు ఎరుగదు.
రెండవ సినిమా చాలామంది చూసుంటరు. దీని గూర్చి తప్పకుండా విని అయినా ఉంటరు. ఆంగ్లంల ఈ సినిమా గురించి పుంఖానుపుంఖాల మెటీరియల్ ఉంది. ఇంటర్నెట్ నిండా. ఆ మొన్న మంథన్తో పాటు ఈ సినిమానీ రెస్టోర్ చేసింటే బాగుండు. అంకూర్ కంటే నాకు వ్యక్తిగతంగా ఈ సినిమాయే ఇష్టమ్. మళ్లీ అదే సబ్జెక్టు. కానీ యింకా సంక్లిష్టం. అక్కడ ఒక ఆలోచన ఉంటే, ఇక్కడ మొత్తం స్క్రీన్ ప్లే ఉంటది. కాన్వాస్ విస్తరిస్తది. కుడ్య చిత్రం.అంతటి గొప్ప సినిమా.
శ్యామ్ బెనగల్ తీసిన తెలంగాణ ట్రిలజీ (Telangana trilogy )ల రెండో సినిమా. నిషాంత్, ఈ సినిమా పేరు. (1975) విశ్వం ఈ సినిమాల హీరో, ప్రోటోగనిస్టు. మళ్లీ అదే దొర. ఆ దొరకి ముగ్గురు కొడుకులు. ఒకడు విశ్వం. వాడికి పెళ్లైంది. ఇంకో ఇద్దరికి కాలేదు. ఊళ్లో ఏ అమ్మాయి కనిపించినా వదలరు. విశ్వం నిజంగ చూస్తే అన్నల కంటే భయస్తుడు. కొంచం ఆలోచనాపరుడు. గొంగళ్ల తినుకుంట ఎంటికలు ఏరలేము కదా! అంతా ఒకే తాను. వాళ్ల బాబుదే రాజ్యం. జమిందారీ. ఆ సీన్ లోకి ఓ సింగిల్ టీచర్ స్కూలు మాస్టరు. భార్యా పిల్లాడుతో దిగాడు. విశ్వం కన్ను ఆ అమ్మాయి మీద పడింది. ఆమె పేరు సుశీల. తమ్ముడి కోసం ఆ అమ్మాయిని తీసుకొచ్చేశారు అన్నలు. ఆ అమ్మాయికి మరో మార్గం లేదు. లోబడింది. తన తక్దీర్ అనుకున్నది.
మొగుడు తన భార్య కోసం ఆ గుమ్మం, ఈ దర్వాజ తిరుగాడు. కానీ వ్యవస్థవి ఇనుపగోడలు! గుడిలో కలిసిన మొగుడిని నిలదీస్తుంది సుశీల. కాల్చేయాల్సింది గడీని! కానీ అట్ల కాజాలదని ఆమెకీ తెలుసు. అంతెందుకూ, ఊళ్లో దేవుని నగలు దొంగిలించారు దొర కొడుకులు. కానీ యా కేసూ లేదు. ఊరంతా తెలుసు. ముసలి గుడి పూజారికి అందరికంటే ముందు తెలుసు. అయితే ఇనపగోడలకి సహితం తుప్పు పడ్తది. సుశీల మొగుడు, గుడి పూజారే మొదట తిరుగుబాటు మంత్రం చదువుతరు.
అవి తెలంగాణ రగులుతున్న రోజులు. ఊరూవాడ తిరగబడింది. అంతవరకు అణగారిన ప్రజలు భగ్గుమన్నారు. తిరగబడ్డ జనం ఒక విధంగా గుడ్డిది, చవిటిది. దొర వారి గడి వల్లకాడైంది. దొర ఇంట్ల విశ్వం భార్య అభం శుభం తెలియనిది. ఆహుతి అవుతుంది ఆ అగ్నికి. విశ్వం ఊరు వదిలి పారిపోవాల్సి వచ్చింది. విచిత్రంగా సుశీల విశ్వంతో మిగిలింది. ఆమె విశ్వంను ఇప్పుడు ప్రేమిస్తున్నది.
బ్యాక్గ్రౌండ్లో కులీ కుతుబ్ షా రాసిన ఘజల్. ప్రేమ పాట. ఈ రెండు సినిమాలు దఖ్నీ భాష మాట్లాడుతయి! అదే మనకు తెలిసిన హైదరాబాదీ. ఇంత ఉర్దూ, అంత మరాఠీ, కూసింత కన్నడ, మళ్ల సింటాక్స్ తెలుగే. ద్రవిడమే. ఆరు వందల ఏండ్ల భాష చరిత్ర! మనం అ రెండు, మూడు సంవత్సరాల తెలుగు సినిమా లిస్టుల ఇవి రెండూ ఇమడవి. అంత వేర్పాటు ఈ రెండు సినిమాల ధోరణి. కథలపరంగా, టెక్నిక్పరంగా చాలా విభిన్నం.
కానీ మనం గర్వంగ ఈరోజు ఆ రెండు సినిమాలు తెలంగాణ సినిమాలని చెప్పుకోవచ్చు. శ్యామ్ బెనెగల్ సాబ్కి స్త్రీ మానసిక చిత్రం బాగా తెలుసు. అదే ఈ సినిమాల్ల మనకు అగుపించేది. ఈ రెండు సినిమాల తర్వాత ఆయన తీసిన సినిమా భూమిక. అదీ స్త్రీ మనసు కాన్వాస్! ఈ రెండు సినిమాలు లేకపోతే అది ఉండేది కాదేమో!
ఈ సినిమాలు రెండు టెక్నిక్ల పరాకాష్ట. అయినా ఎక్కడా అర్థం కాని విషయం ఉండదు. మళ్ల లెన్సూ, లైటు లెక్కలు తప్పదు. ఏ కవిత్వానికైనా, కథకైనా భాష ఒకటే, సినిమాల షాట్లూ, సీన్ల మాదిరి! కానీ ఉపయోగించిన విధానం, చెప్పిన కథా పద్ధతి ఓ సినిమా ఏ స్థాయిదో నిర్ధారణ చేయగలం.
ఈ సినిమాలు అంత ఉత్కృష్టమైనవి. సినిమాలు ఎంటర్టైన్మెంట్ మాధ్యమమే కాదు, చరిత్రకు ప్రతీకలు కూడా! పొరలుపొరలుగా సాగే జీవనయానంల ఏ పొర, లేదా ఆలోచనా స్రవంతి నమోదు కాకుండా ఉండకూడదు అని ఇటువంటి సినిమాలు చెబుతయి.
ఆర్ట్ సినిమా థియేటర్ల రిలీజైన మొదటి ఉదాహరణలు ఈ రెండు సినిమాలే. పైనుంచి సూపర్ హిట్లు. చరిత్ర పుటల్ల ఈ సినిమాలు రెండూ ఉంటయి. ఈ రెండు మన తెలంగాణ చరిత్రవి.
– ఉపేందర్ అప్పరసు