మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘సీఎం కేసీఆర్ సంకల్పం, ఆలోచన చాలా గొప్పది. గొప్ప సంకల్పం ఉన్న వాళ్లను ఎవరూ ఆపలేరు. అలాంటి వారికి భగవంతుడి ఆశీర్వాదాలు ఉంటాయి. ఆయన్ను జాతీయ రాజకీయాల్లోకి రాకుండా ఎవరూ అడ్డుకోలేరు’ అని ఎక్సైజ్‌శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ స్పష్టంచేశారు. సోమవారం మహబూబ్‌నగర్‌లోని మెట్టుగడ్డ వద్ద పిల్లలమర్రి జంక్షన్ ఆధునికీకరణ పనులను రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. అనంతరం పిల్లలమర్రి మహావృక్షాన్ని సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ర్టాన్ని ఒక ప్రయోగశాలగా మార్చి, అభివృద్ధిలో దేశంలోనే నంబర్ వన్‌గా తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్ కృ షిని దేశమంతా గుర్తిస్తున్నదన్నారు.
ఏ రాష్ట్రంలో అమలు కాని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని, కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే ఈ పథకాలన్ని దేశవ్యాప్తంగా అమ లవుతాయని పేర్కొన్నారు. కేసీఆర్ విజన్ ఒక్క తెలంగాణకే కాకుండా దేశమంతటికీ అవసరమని ప్రజలంతా కోరుకుంటున్నారని వెల్లడించారు. ముఖ్యమంత్రి మంచి మనస్సుతో హరితహారం కార్యక్రమాన్ని ఏ ముహూర్తాన ప్రారంభించారో కానీ అప్పటి నుంచి తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయని చెప్పారు. పిల్లల మర్రిని ప్రపంచంలోనే అతిపెద్ద వృక్షంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. మెట్టుగడ్డ జంక్షన్ లో ఏర్పాటు చేసిన ‘మన మహబూబ్‌నగర్’ సె ల్ఫీ పాయింట్ వద్ద మంత్రి, ఎంపీ సెల్ఫీ దిగారు.
పిల్లలమర్రి సంరక్షణకు 2 కోట్లు:ఎంపీ సంతోష్
800 ఏండ్ల చరిత్ర ఉన్న పిల్లలమర్రి మహావృక్షం సంరక్షణకు రూ.2 కోట్లు మంజూరు చేస్తున్నట్టు గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, ఎంపీ సంతోష్‌కుమార్ ప్రకటించారు. పిల్లలమర్రిని సొంత పిల్లల్లా చూసుకున్న మంత్రిని ఆయన అ భినందించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే శ్రీనివాస్‌గౌడ్ ప్రత్యేక చొరవ తీసుకుని పిల్లలమర్రి సంరక్షణకు నడుంబిగించడం అభినందనీయమన్నారు. పిల్లలమర్రి కి తిరిగి ప్రాణం పోసిన యంత్రాంగానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సాట్స్ చైర్మన్ వెంకటేశ్వరరెడ్డి, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.