మహబూబ్‌నగర్ : కేంద్రంలో అరాచక పాలన సాగిస్తున్న బీజేపీ సర్కార్‌ను ఎదుర్కొనే సత్తా సీఎం కేసీఆర్‌కు మాత్రమే ఉన్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మోదీ సర్కార్‌కు ధీటుగా నిలబడేందుకే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ను స్థాపించారని తెలిపారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీ కార్యాలయంలో బీజేపీ కార్యనిర్వాహక సభ్యుడు మల్లేపల్లి సుధాకర్ ఆధ్వర్యంలో దాదాపు వంద మంది మంత్రి సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు. వీరికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. కేంద్రంలోని మతతత్వ పార్టీని అణగదొక్కేందుకు రంగం సిద్ధమైందన్నారు. తెలంగాణ మాదిరిగా దేశమంతా అభివృద్ధి జరగాలనే సంకల్పంతోనే కేసీఆర్ కొత్త పార్టీని స్థాపించారన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం కష్టపడి పనిచేస్తుంటే కొన్ని మతతత్వ శక్తులు వర్గాల మధ్య ఘర్షణ సృష్టించి లబ్ధిపొందాలని చూస్తున్నాయని విమర్శించారు. దేశమంతా తెలంగాణ మోడల్ అమలు కావాలని, అది కేసీఆర్‌తోనే సాధ్యమన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టడమే పనిగా పెట్టుకున్నదని ధ్వజమెత్తారు. దీంతో ఎన్నికల్లో లబ్ధిపొందాలని చూస్తున్నదని ఆరోపించారు. ఇలాంటి మతతత్వ పార్టీలపై పోరాటానికి కేసీఆర్ సై అంటున్నారని చెప్పారు. దేశ ప్రజల బాగుకోసం పనిచేసే వారికి బాసటగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్‌యాదవ్, ముడా చైర్మన్ గంజివెంకన్న, మున్సిపల్ చైర్మన్ కొరమోని వెంకటయ్య, నాయకులు పాల్గొన్నారు.