మహబూబ్నగర్: బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. భక్తికి, త్యాగానికి బక్రీద్ ప్రతీకగా నిలుస్తున్న బక్రీద్ పండుగ.. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు వెరవకుండా దేవునిపై విశ్వాసంతో సన్మార్గంలో జీవించాలని మానవాళికి గొప్ప సందేశాన్ని ఇస్తున్నదన్నారు. ఆదివారం ఉదయం మహబూబ్నగర్ పట్టణంలోని తూర్పు కమాన్ వద్ద ఉన్న జామియా మసీద్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం ముస్లిం సోదరులకు మంత్రి డా. వి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
తమకు కలిగిన దాంట్లో నుంచే ఇతరులకు పంచిపెట్టడాన్ని మించిన దాతృత్వం మరొకటి లేదనే స్ఫూర్తిని బక్రీద్ పండుగ చాటిచెప్తున్నదని తెలిపారు. మంత్రి వెంట మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్, ఎస్పీ వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ రెహమాన్, ముడా చైర్మన్ గంజి వెంకన్న ముదిరాజ్ తదితరులు ఉన్నారు.