హైదరాబాద్, డిసెంబర్ 14(నమస్తే తెలంగాణ): తమది ఇండస్ట్రీ ఫ్రెండ్లీ సర్కారు అని, పారిశ్రామిక వర్గాల్లో ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా చూడాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టంచేశారు. హైదరాబాద్ నుంచి పరిశ్రమలు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్నాయనే ప్రచారానికి ఆస్కారం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
గురువారం సచివాలయంలో శ్రీధర్‌బాబు మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శితోపాటు టీఎస్ఐఐసీ, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. పరిశ్రమల శాఖకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. ప్రస్తుతం అమలవుతున్న పథకాల గురించి తెలుసుకున్నారు.
అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికరంగానికి అనుకూలంగా వ్యవహరిస్తుందని అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న పథకాలు, సబ్సిడీలను యథావిధిగా కొనసాగిస్తుందని స్పష్టంచేసినట్టు అధికారవర్గాలు తెలిపాయి. పారిశ్రామికరంగానికి నష్టం చేకూరేవిధంగా సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు పెట్టకుండా తగిన చర్యలు తీసుకోవాలని, మీడియాకు లీకులు ఇవ్వరాదని సూచించినట్టు తెలిపారు.