రవీంద్రభారతి, నవంబర్ 9: బీఆర్ఎస్ నేత చేసిన సాయాన్ని ఎన్నికల్లో చెప్పినందుకు కక్షగట్టిన మంత్రి శ్రీధర్‌బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత మహిళలను ఉద్యోగాల నుంచి తొలగించడం అమానుషమని, వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని మాలమహానాడు డిమాండ్ చేసింది. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో శనివారం మీడియా సమావేశంలో మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు శ్రీకృష్ణ, దళిత క్రిస్టియన్ అసోసియేషన్ అధ్యక్షుడు మోజోస్, మధ్యాహ్న భోజన పథకం కార్మికురాలు సువర్ణతో కలిసి మాట్లాడారు. మంథని నియోజకవర్గం, కాటారం మండలం, ధన్వాడలో పదేండ్లుగా సువర్ణ మధ్యాహ్న భోజన కార్మికురాలిగా పనిచేస్తున్నదని తెలిపారు.
ప్రమాదవశాత్తు సువర్ణ ఇల్లు కాలిపోగా.. బీఆర్ఎస్ నేత పుట్ట మధు సాయం చేసిన విషయాన్ని ఎన్నికల ప్రచారంలో చెప్పిందన్నారు. దీంతో ఆమెపై కక్షగట్టిన మంత్రి, సోదరుడు శ్రీను.. మధ్యాహ్న భోజన పథకం నుంచి తొలగింపజేశారని తెలిపారు. సువర్ణ మాట్లాడుతూ 2023 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పుట్టమధు చేసిన సాయాన్ని చెప్పానని, అధికారంలోకి రాగానే కక్షగట్టిన మంత్రి శ్రీధర్, ఆయన సోదరుడు తనను, తనతోపాటు పనిచేసే ఇద్దరు దళిత మహిళలను విధుల్లో నుంచి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇల్లు కాలినప్పుడు, పిల్లల పెండ్లిళ్లకు సాయం చేసిన పుట్ట మధు పేరు చెప్పడమే పాపమా అని కన్నీటి పర్యంతమయ్యారు. మంత్రి, అతని సోదరుడిపై సీఎం చర్యలు తీసుకొని తమను విధుల్లో తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.