హైదరాబాద్, ఏప్రిల్ 5(నమస్తే తెలంగాణ): విదేశాల ఉత్పత్తులపై సుంకాలను విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం మనకు మేలే చేస్తున్నదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. ఈ కీలక సమయంలో పెట్టుబడులు పెట్టాలనుకునే పారిశ్రామికవేత్తలు భారత్ వైపు చూసే అవకాశాలున్నాయని, ఈ పరిణామాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. శనివారం గ్లోబల్ ఇండియా బిజినెస్ ఫోరం(జీఐబీఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించిన “ఇండియా – లాటిన్ అమెరికా, కరీబియన్ కంట్రీస్ బిజినెస్ కాంక్లేవ్” రెండో ఎడిషన్ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పరిశ్రమల ఏర్పాటుకు తెలంగాణలో అనుకూల పరిస్థితులు ఉన్నాయని, ఇకడ పెట్టుబడులు పెట్టేలా స్థానిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని లాటిన్ అమెరికా, కరీబియన్ దేశాల అధికార ప్రతినిధులకు సూచించారు. ప్రభుత్వం తరఫున పారిశ్రామికవేత్తలకు అందించే ప్రోత్సాహాకాలను వారికి వివరించారు. రాబోయే రోజుల్లో దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ కీలక పాత్ర పోషించనున్నదనే ఆశాభావం వ్యక్తంచేశారు. ఎంఎస్ఎంఈలు ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటేలా ప్రత్యేక పాలసీని తీసుకొచ్చామని, తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు. జహీరాబాద్ నిమ్జ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు 6 అంతర్జాతీయ స్థాయి సంస్థలు ముందుకొచ్చాయని, వీటిలో మూడు కొరియా కంపెనీలు కూడా ఉన్నాయన్నారు. రాష్ట్రంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసేలా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నామన్నారు.