హైదరాబాద్, జనవరి 11(నమస్తే తెలంగాణ) : భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని ముక్తీశ్వరాలయం, గోదావరి సంగమ తీరంలో ఈ ఏడాది మే 15 నుంచి 26 వరకు నిర్వహించనున్న సరస్వతీ నది అంతర్వాహిని పుష్కరాలకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. శనివారం సచివాలయంలో సంబంధిత అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిర్మాణాలను శాశ్వత ప్రాతిపదికన అత్యాధునిక వసతులతో కళాత్మకంగా రూపొందించాలని స్పష్టంచేశారు.
‘ప్రభుత్వం కేటాయించిన రూ.25 కోట్లతో స్నానఘట్టాల నిర్మాణం, రోడ్ల విస్తరణ, భూగర్భ డ్రైనేజీ నిర్మాణం, సరస్వతీ విగ్రహ ప్రతిష్ఠాపన తదితర పనులను వేగంగా పూర్తిచేయాలి. పుషరాల నిర్వహణకు ప్రత్యేక టాస్‌ఫోర్స్ ఏర్పాటుచేయాలి. కాళేశ్వరంలో అత్యాధునిక, ఆకర్షణీయమైన నూతన బస్‌స్టేషన్‌ను నిర్మించాలి. వీధి దీపాలు, ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటుచేయాలి. ఫిబ్రవరి 7 నుంచి 19 వరకు నిర్వహించనున్న కుంభాభిషేకం పనులను పకడ్బంధీగా చేపట్టాలి.’ అని మంత్రి అధికారులను ఆదేశించారు. సమావేశంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, భూపాలపల్లి కలెక్టర్ రాహుల్‌శర్మ, దేవాదాయశాఖ కమిషనర్ శ్రీధర్, టూరిజం ఎండీ ప్రకాశ్, ట్రాన్స్ కో ఎస్ఈ మల్సూర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.