హైదరాబాద్, డిసెంబర్ 1(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫార్మేషన్(హిల్ట్) పాలసీపై మంత్రి శ్రీధర్‌బాబు మాట మార్చారు. గాంధీభవన్‌లో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ సేల్‌డీడ్ ఉన్న భూములకు మాత్రమే హిల్ట్ ద్వారా మల్టీ యూజ్ జోన్‌కు మార్చుకునే అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు. లీజు భూములకు అవకాశం లేదని స్పష్టంచేశారు. ఖాయిలా పడిన పరిశ్రమలను వినియోగంలోకి తెచ్చే ప్రయత్నమే హిల్ట్ పాలసీ అని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ భూమిని ఎవ్వరికీ బదిలీ చేయడంలేదని, భూములు ఉన్నవారికి మాత్రమే కన్వర్షన్ అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపారు.
లీజు భూములను ఎక్కడా కన్వర్షన్ చేయడంలేదని స్పష్టంచేశారు. అయితే, ప్రభుత్వం ప్రకటించిన హిల్ట్ పాలసీ ప్రకారం, కాలుష్యాన్ని నివారించేందుకు ఔటర్ రింగురోడ్డు లోపల ఉన్న 22 పారిశ్రామికవాడల్లోని 9292ఎకరాల భూములను రిజిస్ట్రేషన్ ధరలో కేవలం 30శాతం చెల్లించి మల్టీ యూజ్ కోసం కన్వర్షన్ చేసుకునే వెసులుబాటు ఉంది. హిల్ట్ పాలసీ ద్వారా పెద్ద ఎత్తున పరిశ్రమ భూములను స్వాహా చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నిందనే విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వ పెద్దలు పునరాలోచనలో పడ్డారు. ఇందులో భాగంగానే తాజాగా మంత్రి శ్రీధర్‌బాబు మాట మార్చారనే చర్చ జోరుగా సాగుతున్నది.