పెద్దపల్లి : కేజీబీవీలో(KGBV Student) అస్వస్థతకు గురైన బాలికలు పూర్తిస్థాయిలో కోలుకునే వరకు మెరుగైన వైద్య చికిత్స అందిస్తామని మంత్రి డి.శ్రీధర్ బాబు(Sridhar Babu) తెలిపారు. పెద్దపల్లి జిల్లా దవాఖానలో అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న ముత్తారం మండల కేంద్రంలోని కేజీబీవీ విద్యార్థినులను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వార్డెన్ సమాచారం అందించడంతో వెంటనే జిల్లా హాస్పిటల్‌కు 53 మంది బాలికలను తరలించి చికిత్స అందించాన్నారు.
బాలికలు ఒకే సారి అస్వస్థతకు గురి కావడానికి గల కారణాలను విచారిస్తున్నామని, అక్కడ సమీపంలో గల డంప్ యార్డ్‌ను తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని మంత్రి తెలిపారు. 53 మంది బాలికలు క్షేమంగా ఉన్నారని ఎవరు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కేజీబీవీ పాఠశాలలో కూడా పారిశుధ్య నిర్వహణ, పరిసరాల పరిశుభ్రత పై కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తారని, భవిష్యత్తులో బాలికలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు.