AICC | హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డిని ఏఐసీసీ పెద్దలు నమ్మడం లేదా? రాహుల్ టీమ్ ముఖ్యమంత్రిపై డేగకన్ను వేసిందా? అందుకే ప్రధాని మోదీని కలిసే ప్రతి సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి నమ్మకస్తుడైన ఓ ముఖ్య నేతను హై కమాండ్ ఆయన వెంట పంపుతున్నదా? అంటే అవుననే సమాధానం వస్తున్నది. సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి గత 15 నెలల్లో ప్రధాని మోదీని మూడు సార్లు కలిశారు. అయితే గతంలో రెండు సార్లు ఆయన వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నారు. అప్పట్లో ఖమ్మంలో అధికారిక పర్యటనకు వెళ్లేందుకు సిద్ధమైన భట్టిని కాంగ్రెస్ హైకమాండ్ హుటాహుటిన ఢిల్లీకి పిలిపించి సీఎం రేవంత్‌రెడ్డి వెంట ప్రధానితో భేటీకి పంపింది.
తాజాగా కాంగ్రెస్ పార్టీకి ముందు నుంచి నమ్మకస్తుడిగా పేరున్న మంత్రి శ్రీధర్‌బాబు ముఖ్యమంత్రి వెంట ఉన్నారు. రేవంత్‌రెడ్డి సొంత నిర్ణయాలతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిష్ఠ మసకబారుతున్నదని భావించి ఆయనపై రాహుల్‌గాంధీ కోపంగా ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో రేవంత్‌రెడ్డి ప్రధాని మోదీని కలిసిన సందర్భంలో లేదా ఆయన విదేశీ పర్యటనల్లో కచ్చితంగా ఓ నేతను వెంట పంపుతున్నారని తెలుస్తుంది. సీఎం రేవంత్‌రెడ్డి సొంత ఎజెండాతో ముందుకెళ్తే పార్టీకి మరింత నష్టం జరుగుతుందని భావించి కాంగ్రెస్ అధిష్ఠానం ఈ మేరకు ముందుజాగ్రత్తలు తీసుకున్నట్టు సమాచారం. ఆయా సందర్భాల్లో రేవంత్ కదలికలపై సైతం హై కమాండ్ దృష్టి సారించినట్టు తెలిసింది. ఢిల్లీ, విదేశీ పర్యటనల్లో రేవంత్‌రెడ్డి ఎవరిని కలుస్తున్నారు, ఏం చర్చిస్తున్నారు అనే విషయాలపై హైకమాండ్ ప్రత్యేకంగా ఆరా తీస్తున్నట్టు సమాచారం.