వనపర్తి, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. పథకాల అమలులో బీజేపీ, కాంగ్రెస్‌పాలిత రాష్ర్టాలను తెలంగాణతో పోల్చలేమని స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన వనపర్తిలోని తన క్యాంపు కార్యాలయ ఆవరణలో మున్సిపల్ వాహనాలను అందజేశారు. మత్స్యకార భవన నిర్మాణ స్థలం, ఎస్సీ, బీసీ డిగ్రీ కళాశాల, వ్యవసాయ కళాశాలల భవనాల స్థలాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని చెప్పారు. ఎనిమిదేండ్ల కాలంలో పల్లెల స్వరూపం మారగా.. వృత్తిదారులు బలపడ్డారని తెలిపారు. ఉచిత చేప పిల్లలతో మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక భరోసానిచ్చామన్నారు. సబ్సిడీ గొర్రె పిల్లలతో గొల్ల కురుమలకు మంచి రోజులు వచ్చాయని పేర్కొన్నారు. కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, ఆసరా పథకాలతో మధ్యతరగతి, బలహీన వర్గాలకు భరోసా లభించిందన్నారు. రైతుబంధు, రైతుబీమా, సాగునీరు, నిరంతర విద్యుత్తుతోపాటు సీఎం కేసీఆర్ కృషితో వ్యవసాయం పండుగలా మారిందన్నారు. అంతకుముందు ఆయన వనపర్తి పట్టణంలో వర్షానికి ఇండ్లు కూలిన బాధితులను పరామర్శించారు.