వరంగల్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్’ అన్న చందంగా ఉంది మంత్రి సీతక్క వ్యాఖ్య. ములుగులో మల్టీపర్పస్ వర్కర్ మైదం మహేశ్ మృతికి సర్కార్‌కు సంబంధం లేదని పేర్కొంటూనే అందుకు సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని పేర్కొనడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘జీతం ఆలస్యం కావడంలో ప్రభుత్వ తప్పిదంలేదు. ప్రాసెస్ చేసే సమయంలో స్థానిక పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యంవల్ల రెండు నెలల వేతనం ఆలస్యమైంది’ అని సోమవారం సీతక్క విడుదల చేసిన ప్రకటన వివాదాస్పదం అవుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమందికి జీతాలు సమయానికి అందాయని, మహేశ్ విషయంలో స్థానిక సిబ్బంది పొరపాటుతో నిర్లక్ష్యం జరిగిందని, బాధ్యులైన పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేసి, బిల్ కలెక్టర్‌ను విధుల నుంచి తొలగించామని మంత్రి సీతక్క పేర్కొన్నారు. మహేశ్ మృతిపై బీఆర్ఎస్ చేస్తున్న విమర్శల్లో సహేతుకతలేదని చెప్పారు. బీఆర్ఎస్ ఒత్తిడివల్లే మహేశ్ మృతిపై సర్కార్ కదిలి, మంత్రి సీతక్క స్పందించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.