హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): ‘ఉపాధి హామీ పథకంలో డిమాండ్ ఆధారంగా కాకుండా నార్మేటివ్ (నిబంధనల) విధానంలో పనిదినాలను కేటాయించాలనే ప్రతిపాదన సరైంది కాదు. వ్యవసాయ సీజన్లో ఉపాధి పనులకు 60 రోజులపాటు విరామం ఇవ్వాలనే నిబంధనను పూర్తిగా తొలగించాలి’ అని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి (పీఆర్ఆర్డీ) శాఖ మంత్రి సీతక కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం జూలై ఒకటి నుంచి దేశవ్యాప్తంగా అమలు చేయాలని ప్రతిపాదించిన వీబీజీ రాంజీ పథకంపై తెలంగాణ ప్రభుత్వం తన తీవ్ర నిరసనను అధికారికంగా తెలుపాలని నిర్ణయించిందని, ఈ మేరకు కేంద్రానికి నిరసన లేఖ రాస్తామని ఆమె శనివారం వెల్లడించారు. ఆ లేఖలో పొందుపరచాల్సిన ముఖ్యాంశాలపై ఆమె జ్యోతిబాఫూలే ప్రజాభవన్‌లో ఉన్నతాధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు.
పంటల సీజన్లోనే రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని, ఆ సమయంలోనే ఉపాధి హామీ ద్వారా వన మహోత్సవం, మొకలు నాటే కార్యక్రమాలు చేపడుతామని వివరించారు. ఈ సమయంలో 60 రోజుల విరామం ఇస్తే మొకలు నాటే ప్రక్రియ నిలిచిపోతుందని, ఇది కేంద్రం ప్రతిపాదించిన గ్రీన్ ఇండియా లక్ష్యాలకే గొడ్డలిపెట్టు అని పేరొన్నారు.
కొండ, ఆదివాసీ ప్రాంతాల్లో పంటల సీజన్ 60 రోజులపాటు ఉండదని, అకడ ఈ నిబంధనలు అస్సలు ఆచరణ సాధ్యం కావని పేర్కొన్నారు. గ్రామీణాభివృద్ధి పనులకూ అంతరాయం కలుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. దీంతో కేంద్రానికి లేఖ రాయనున్నట్టు ఆమె తెలిపారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్‌శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దానకిశోర్, కమిషనర్ దివ్యాదేవరాజన్, స్పెషల్ కమిషనర్ శ్రీలక్ష్మి, జాయింట్ కమిషనర్ నరసింహులు,పలు శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.