Seethakka | హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ) : గ్రామాల్లో ప్రజలు తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్యలపై వార్తా పత్రికల్లో వస్తున్న కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎర్రమంజిల్‌లోని మిషన్ భగీరథ కార్యాలయం నుంచి గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌శాఖల మంత్రి సీతక్క అధికారులతో సమీక్ష నిర్వహించారు. పత్రికా కథనాలు తప్పా..? సమస్య లేదంటూ మీరు ఇస్తున్న నివేదికలు తప్పా? అని అధికారులను ప్రశ్నించారు.
తాగునీటి సమస్యలు ఉన్నాయంటూ వచ్చే కథనాలపై గ్రామాల నుంచే ప్రజలకు నిజాలను తెలియజేయాలని సూచించారు. మిషన్ భగీరథ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, రోజూ ఉదయం 8 గంటలలోపు మంచినీటి సరఫరాపై తనకు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఏజెన్సీ గ్రామాల్లో బోర్లు వేసి తాగునీరు అందిస్తున్నట్టు తెలిపారు. తాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రతీ జిల్లా కలెక్టర్ వద్ద రూ.2 కోట్ల నిధులను అందుబాటులో పెట్టామని, మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయంలో 24 గంటలపాటు పనిచేసేలా కాల్‌సెంటర్ ఏర్పాటు చేశామని తెలిపారు.