హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల కాళ్లను తెలంగాణ ఆడబిడ్డలు కడిగినట్టుగా వస్తున్న వార్తలపై మంత్రి సీతక్క వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ మేరకు గురువారం వీడియో విడుదల చేశారు. ‘గుడి ప్రాంగణంలో 33 మంది ప్రపంచ సుందరీమణులు ఒకేసారి కాళ్లు కడుక్కుంటే నీళ్లు వరదలా పారి.. బురదైతదన్న ఉద్దేశంతో ప్రభుత్వం వాళ్లు కాళ్లు కడుక్కోవడానికి ప్లేటు, చెంబు ఎవరిది వారికి ఇచ్చింది.
ఈవెంట్ మేనేజ్మెంట్కు చెందిన ఓ అమ్మాయి ఒకరికి చెంబుతో నీళ్లు పోయడం, ఇంకేదో చేసినంత మాత్రాన రాద్ధాంతం చేస్తున్నరు. గుడిలోకి కాళ్లు కడుక్కొని వెళ్లడం గిరిజన సంప్రదాయం. అకడ అదే పాటించారు’ అని వీడియో ద్వారా మంత్రి తెలిపారు. మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల రామప్ప పర్యటనను వివాదాస్పదం చేయడం సరి కాదని చెప్పారు.