జనగామ టౌన్, జూలై 5 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కన్నెపల్లి పంప్‌హౌస్ పరిశీలనకు వెళ్తున్న బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌లో మంత్రి సీతక్క ఇరుక్కున్నారు. ఆదివారం కేటీఆర్ కన్నెపల్లి పంప్‌హౌస్ సందర్శనకు భారీ కాన్వాయ్‌తో వెళ్తుండగా, జనగామ జిల్లా పెంబర్తి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ – వరంగల్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఇదే మార్గంలో మంత్రి సీతక వస్తూ ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. కేటీఆర్ కాన్వాయ్ ముందుకు కదిలి వెళ్లేంత వరకు ఆమె కాన్వాయ్‌ని పోలీసులు పెంబర్తి శివారులో సుమారు అరగంటపాటు నిలిపివేశారు.
ములుగురూరల్: కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి చెందిన నిపుణుల సూచనలు, సలహాలను రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తుందని మంత్రి సీతక్క తెలిపారు. ఆదివారం ఆమె ములుగులో మీడియాతో మాట్లాడుతూ.. కన్నెపల్లి పంప్‌హౌస్‌ను సురక్షితంగా వినియోగంలోకి తెచ్చేందుకు నిపుణులతో ప్రభుత్వం చర్చిస్తున్నదని పేర్కొన్నారు. మేడిగడ్డను భద్రంగా పునరుద్ధరించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని చెప్పారు.