హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలిసేందుకు సమయం కోరినట్టు మంత్రి సీతక్క తెలిపారు. మేడారం మహాజాతర ఆహ్వాన పత్రికను కేసీఆర్‌కు అందజేసి తానే స్వయంగా జాతరకు ఆహ్వానిస్తానని చెప్పారు. మంగళవారం ఆమె అసెంబ్లీ లాబీలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు.. ప్రతి ఒకరినీ కలుస్తూ ఆహ్వాన లేఖలు అందజేస్త్తూ మేడారం జాతరకు ఆహ్వానిస్తున్నట్టు పేర్కొన్నారు. మీడియా ప్రతినిధుల కోసం 28న జాతర ప్రారంభం రోజు హైదరాబాద్ నుంచి ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. జాతర చూసి 29న తిరిగి హైదరాబాద్ నగరానికి రావచ్చని పేర్కొన్నారు.
హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ లాబీలో మంగళవారం ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకున్నది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి లాబీలో కలిశారు. రాష్ర్టానికి కాబోయే బీసీ ముఖ్యమంత్రి మహేశ్‌గౌడ్.. అని బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి సంబోధించారు. దీంతో పక్కనే ఉన్న ఆది శ్రీనివాస్, దానం.. డంగ్ అయిపోయారు. ‘కనీసం పెద్ద కల అయినా కనండి’ అని వ్యాఖ్యానించారు. ‘అన్నా.. మీరు ఇప్పుడు ఏ పార్టీనే’ అని దానం నాగేందర్‌ను పాత్రికేయులు అడుగగా, కాంగ్రెస్ అని బదులిచ్చారు. అసెంబ్లీలో మీరు మాట్లాడుతుంటే స్క్రీన్‌పై బీఆర్ఎస్ అని వస్తుందే.. అని చెప్తే.. ‘నేను ఎప్పుడూ యుద్ధరంగంలోనే ఉంటున్న. నాకు పోటీ కొత్త కాదు. ఎలక్షన్లు కొత్త కాదు. ఇప్పుడు, ఎప్పుడైనా ఎన్నికలకు సిద్ధమే’ అని దానం పేర్కొన్నారు.