ములుగు, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న మంత్రి సీతక్కను స్థానికులు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ఇందిరమ్మ ఇండ్లు, సంక్షేమ పథకాలపై కడిగిపారేస్తున్నారు. సహనం కోల్పోతున్న మంత్రి ప్రజలపై రుసరుసలాడుతున్నారు. పంచాయతీ శాఖ మంత్రిని తానేనని, నిధులు తనవద్దే ఉంటాయంటూ బెదిరింపు ధోరిణిని ప్రదర్శిస్తున్నారు. ఆదివారం కన్నాయిగూడెం మండలం ఏటూరు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీతక్కను గిరిజన మహిళలు ని లదీశారు. తమకు ఏం ఇచ్చావో చెప్పాలి? ఇండ్లు ఏవని అడిగారు. సీతక్క నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ప్రజలు వినలేదు. ఇం డ్లను గ్రామాల్లో దేవుడి ప్రసాదం లెక్క పంచుతున్నామని, మిగతా ఇండ్లు ఇచ్చేది తామేనని, సన్నబియ్యం, రేషన్‌కార్డులు ఇచ్చింది తామేనని చెప్పుకొచ్చారు. ‘ఎవరికి ఇచ్చావ్? మాకు వద్దా?’ అని మహిళలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘మిమ్మల్ని ఎవరు పంపించారో తెలుసు.. ఎవరు అడిగిస్తున్నారో కూడా తెలుసు’ అన్నారు. ‘ఏటూరు నాగారం సర్పంచ్ స్థానం ఒక్కటే గెలిస్తే అయిపోదు. పంచాయతీ రాజ్శాఖకు నేనే మంత్రిని. నిధులు నా వద్దే ఉంటాయి’ అని హెచ్చరించారు.
కోటపల్లి, డిసెంబర్ 14: పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ప్రచారానికి వచ్చే అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులను స్థానిక సమస్యలపై గ్రామస్తులు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ఈక్రమంలో ఆదివారం మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం లింగన్నపేటలో పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ప్రచారం చేయడానికి మంత్రి వివేక్ అక్కడకు చేరుకున్నారు. దీంతో స్థానిక సమస్యలపై గ్రామస్తులు ఆయనపై ప్రశ్నలు వర్షం కురిపించారు. ‘స్థానిక సంస్థల ఎన్నికలొచ్చాయని ఇప్పుడొచ్చారా?.. మా ఊరిలో నీటి సమస్య ఉన్నది.. మా ఊరికి రోడ్డు కూడా సరిగా లేదు.. మీరు ఏం చేస్తున్నట్టు’ అంటూ నిలదీశారు. తనకు ఇందిరమ్మ ఇల్లు రాకుండా గ్రామానికి చెందిన ఓ కాంగ్రెస్ నాయకుడు అడ్డుకున్నాడని ఓ మహిళ మంత్రి ఎదుట ఆవేదన వెల్ల్లబోసుకున్నది. ఎన్నికల సమయంలో కాకుండా మిగతా సమయాల్లోనూ వస్తే బాధలు తెలుస్తాయని పేర్కొన్నారు. దీంతో అక్కడి నుంచి మెళ్లిగా వేరే ప్రాంతానికి వెళ్లిపోయారు.