హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ) : మహిళా సంఘాల తరఫున తాము బ్యాంకులకు గ్యారెంటీ ఇస్తున్నామని, వాళ్లు తీసుకొనే ప్రతి పైసాను చెల్లిస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ధనసరి సీతక్క హామీ ఇచ్చారు. యాక్షన్‌ప్లాన్‌కు అనుగుణంగా మహిళా సంఘాలకు రుణ సదుపాయం కల్పించేందుకు బ్యాంకర్ల సహకరించాలని కోరారు. 98.5శాతం రుణాలను రీపే చేసి మహిళా సంఘాలు రికార్డు సృష్టించినట్టు గుర్తుచేశారు. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో గురువారం పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) వార్షిక యాక్షన్ ప్లాన్ 2025-26 కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని 3,55,138 స్వయం సహాయక సంఘాలకు రూ.19,838.58 కోట్ల బ్యాంకు రుణాల మంజూరు లక్ష్యంగా సెర్ప్ వార్షిక యాక్షన్‌ప్లాన్‌ను ప్రకటించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు బ్యాంకుల రుణాలు ఎగవేస్తున్నారని, సూటుబూట్లతో కనిపించి ముంచుతున్నారని ఆరోపించారు. స్వయం సహాయక సంఘాలు తీసుకున్న రుణాలను తిరిగి చెల్లిస్తున్నట్టు తెలిపారు. ఈ సంఘాలు ఉపాధి స్థాయి నుంచి సంపద సృష్టించే స్థాయికి ఎదిగాయని, పది మందికి ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పారు. అనంతరం స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఆర్థిక అక్షరాస్యత సమాచార దీపికను మంత్రి విడుదల చేశారు. పీఆర్ఆర్డీ కార్యదర్శి లోకేశ్‌కుమార్, సెర్ప్ సీఈవో దివ్యాదేవరాజన్, స్త్రీనిధి ఎండీ విద్యాసాగర్‌రెడ్డి, బ్యాంకర్లు, జిల్లా మహిళా సమా ఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు.