హైదరాబాద్ : గంజాయి, డ్రగ్స్ పై ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతోందని మంత్రి సీతక్క(Minister Seethakka) అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడి, హత్య(Girl harassment) ఘటన స్థలాన్నిమంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, పెద్దపల్లి (Peddapalli) ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే విజయ రమణారావుతో కలిసి ఆదివారం పరిశీలించారు. అనంతరం బాలిక కుటుంబాన్ని పరామర్శించారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి రైస్ మిల్లో ఘటన స్థలాన్ని పరిశీలించి రామగుండం సీపీ శ్రీనివాస్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సంర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ..ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. దీనికి కారణం గంజాయి, డ్రగ్స్ వాడకమేనని ఆమె తెలిపారు.
మత్తుకు అలవాటు పడి వావి వరస అనే తేడా లేకుండా ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతున్నారని మంత్రి తెలిపారు. తల్లిదండ్రుల మధ్య పడుకున్న చిన్నారిని ఎత్తుకెళ్లి లైంగికదాడి చేసి హత్య చేసిన ఘటన చాలా బాధాకరమన్నారు. ఈ ఘటన పై ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. రాత్రి వేళలో పోలీసులు గస్తీ పెంచాలన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా అన్ని విధాల ఆదుకుంటామన్నారు.