Minister Seethakka | వరంగల్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఇసుక ఎక్కువగా లభించే ములుగు జిల్లాలో అధికార పార్టీ నాయకులు చెప్పిన వారికే ఇసుక తవ్వకాల పర్యవేక్షణ అధికారిగా పోస్టింగ్ దక్కుతున్నది. పంచాయతీరాజ్ మంత్రి సీతక్క సిఫారసు చేసిన వారికే ఆమె సొంత జిల్లా ములుగు టీజీఎండీసీ ప్రాజెక్టు అధికారిగా పోస్టింగ్ దక్కింది. రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, లారీల్లో లోడింగ్ పర్యవేక్షణ అంతా తెలంగాణ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీఎండీసీ) ఆధ్వర్యంలోనే జరుగుతుంది.
నదులు, నదుల వెంట ఉన్న ప్రైవేటు భూముల్లో ఇసుక తవ్వకాలు, లోడింగ్, రవాణా పర్యవేక్షణ కోసం ఇసుక వనరులు ఉన్న జిల్లాకు ప్రత్యేకంగా ప్రాజెక్టు అధికారులను నియమిస్తున్నది. ములుగు జిల్లాలో మాత్రం మంత్రి సీతక్క చెప్పిన వారికే ఈ పోస్టు దక్కింది.
టీజీఎండీసీ ములుగు జిల్లా ప్రాజెక్టు అధికారిగా.. గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో హైడ్రోజియోలజిస్టుగా పనిచేస్తున్న అలువాల శ్రీకాంత్ ఇటీవలే పీవోగా విధుల్లో చేరారు. పీవో పోస్టు కావాలని ఆయన జూన్ 4న దరఖాస్తు పెట్టుకున్నారు. రెండు నెలల వరకు దరఖాస్తు కదలలేదు. శ్రీకాంత్‌కు పోస్టింగ్ ఇవ్వాలని సీతక్క ఈనెల 8న టీజీఎండీసీ మేనేజింగ్ డైరెక్టర్‌కు స్వయంగా సిఫారసు లేఖ పంపారు. ఈ లేఖ అందగానే అధికార యంత్రాంగం వేగంగా స్పందించింది. ఎండీసీలో పనిచేసేందుకు శ్రీకాంత్‌కు అనుమతి ఇవ్వడంతోపాటు సొంత శాఖ నుంచి రిలీవ్ చేస్తూ గ్రౌండ్ వాటర్ డిపార్టుమెంట్ డైరెక్టర్ ఈనెల 7న టీజీఎండీసీకి లేఖ ఇచ్చారు.
9న ఆయన విధుల్లో చేరారు. ములుగు జిల్లాలోని 102 ఎకరాల్లో 11 ఇసుక క్వారీలను మైనింగ్ శాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పీసా గ్రామ సభలను నిర్వహించి ఆదివాసీ సంఘాలు, నిబంధనల మేరకు ఇతరులకు ఈ క్వారీలను కేటాయించారు. మంగపేట మండలం మల్లూరు, చుంచుపల్లిలో.. వాజేడు మండలం అయ్యవారిపేట, ధర్మవరం, రాంపూర్‌లో.. వెంకటాపురం(నూగూరు) మండలం మొర్రివానిగూడెం, శ్రీరంగపురం, కే కొండాపురం, ఒంటి చింతగూడెంలో క్వారీలు ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో ఎనిమిది ఇసుక క్వారీలు నడుస్తున్నాయి.
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటుకు చెందిన ప్రతి ఇసుక క్వారీ, స్టాకు యార్డు, ఇసుక లోడింగ్ వంటి ప్రక్రియ టీజీఎండీసీ పీవో పర్యవేక్షణలోనే జరుగుతాయి. గోదావరి నది నుంచి రోజూ వందల లారీల్లో ములుగు జిల్లా నుంచి వరంగల్, హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు ఇసుక రవాణా అవుతున్నది. నిబంధనలకు విరుద్ధంగా అధికార పార్టీ నేతల మద్దతు, అధికారుల సహకారంతో కోట్ల రూపాయల ఇసుక వ్యాపారం జరుగుతున్నది.