హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ) : ఆపరేషన్ కగార్‌ను తక్షణం నిలిపివేయకపోతే పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగే ప్రమాదం ఉన్నదని, ప్రాణనష్ట నివారణకు కృషిచేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ధనసరి సీతక్కకు భారత్ బచావో సంస్థ విజ్ఞప్తిచేసింది. ప్రజాభవన్‌లో మంగళవారం ఆ సంస్థ ప్రతినిధులు గాదె ఇన్నయ్య, డాక్టర్ ఎంఎఫ్ గోపీనాథ్, జంజర్ల రమేశ్‌బాబు మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు కర్రెగుట్టల్లో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని నిలువరించేలా మీ వంతుగా చొరవ చూపాలని కోరారు. వేల సంఖ్యలో కేంద్ర బలగాలు కర్రెగుట్ట ప్రాంతాల్లో సంచరిస్తుండటంతో ఆదివాసీలు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. సంస్థ ప్రతినిధుల వినతిపై మంత్రి సానుకూలంగా స్పందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగానికి లోబడే వ్యవహరించాలని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఆదివాసీల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆపరేషన్ కగార్‌ను తక్షణం నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శాంతియుత వాతావరణం నెలకొల్పడమే ప్రభుత్వాల లక్ష్యంగా ఉండాలని సూచించారు.