హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): బస్సుల్లో మహిళలు ఎల్లిపాయల పొట్టు తీయడం తప్పెలా అవుతుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమశాఖల మంత్రి సీతక్క ప్రశ్నించారు. మహిళలు తమ ప్రయాణ సమయాన్ని వృథా చేసుకోకుండా పనులు చేసుకుంటున్నారని పేర్కొన్నారు.
కొందరు కుట్లు, అల్లికలు చేసుకుంటున్నారని పేర్కొన్న మంత్రి.. కూరగాయలు అమ్ముకున్నా తప్పేమీ లేదని అన్నారు. రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో బుధవారం జరిగిన స్త్రీనిధి క్రెడిట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ 11వ సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా సీతక హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉచిత ప్రయాణాన్ని అవహేళన చేస్తూ కొందరు వీడియోలు రూపొందించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, మహిళా సాధికారతను తట్టుకోలేకే ఆ పథకంపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. మహిళలకు చేయూతనిస్తుంటే ఎందుకంత అక్కసు వెళ్లగక్కుతున్నారని ప్రశ్నించారు. సచివాలయంలో ప్రారంభమైన మహిళా శక్తి క్యాంటీన్లను జిల్లాలకు విస్తరిస్తున్నట్టు తెలిపారు.