వరంగల్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలో మూడు దశల్లో రుణమాఫీ చేసినా.. పావువంతు మందికి మాత్రమే మాఫీ అయినట్టు తెలుస్తున్నది. పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క సొంత నియోజకవర్గం ములుగు కేంద్రానికి సమీపంలోని పంచోత్కులపల్లిలో రుణమాఫీకాని రైతులే ఎక్కువగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పంట రుణాలమాఫీ ఒట్టిదేనని ములుగు జిల్లా ములుగు మండలం పంచోత్కులపల్లిలోని రైతుల పరిస్థితి చూస్తే స్పష్టమవుతున్నది. పంచోత్కులపల్లిలో 180 ఇండ్లు ఉన్నాయి. 450 మంది ఓటర్లు ఉన్నారు. పూర్తిగా వ్యవసాయమే ఆధారం. పంచోత్కులపల్లిలో 155 మంది రైతులకు వివిధ బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నాయి. ములుగు పీఏసీఎస్, జంగాలపల్లిలోని యూనియన్ బ్యాంకులో వీరంతా పంట రుణాలు తీసుకున్నారు. బ్యాంకు ఖాతాలున్న 155 మంది రైతుల్లో భార్యభర్తలకు వేర్వేరుగా అకౌంట్లు ఉన్నాయి.
ప్రభుత్వం మూడు విడతల్లో రుణమాఫీ చేయగా, మొదటి విడతలో 12 మందికి, రెండో విడతలో 15 మందికి, మూడో విడతలో ఐదుగురికి మాత్రమే మాఫీ అయ్యింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క కుటుంబానికి రూ. 2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేశామని ప్రకటించింది. రేషన్‌కార్డు ప్రమాణికంగా కుటుంబ నిర్ధారణ అని నిబంధనలు పెట్టింది. గ్రామాల్లో ఒకే ఇంటి పేరు ఉన్న కుటుంబాలు ఎక్కువగా ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన నిబంధనతో ఎక్కువ మంది రుణాలు మాఫీ కాలేదు. భార్య, భర్త ఒకే రేషన్ కార్డులో ఉంటారు. వీరిద్దరు వేర్వేరుగా లక్ష చొప్పున పంట రుణాలు తీసుకుంటే వీరికి మాఫీ కాలేదు. ఆధార్‌కార్డుల పేర్లలో పొరపాట్లు, ఇతర కారణాలతోనూ రుణమాఫీ దక్కలేదు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రూ. 25 వేల చొప్పున నాలుగు విడుతల్లో రూ. లక్ష వరకు రుణమాఫీ జరిగింది. ఇప్పుడు పావు మందికి మాత్రమే రుణమాఫీ అయ్యిందని, అందరికీ కాలేదని రైతులు అంటున్నారు.
భార్యకు, భర్తకు కలిపి రేషన్‌కార్డు ఒకటే ఉంటుంది. నా పేరు మీద రూ. 2 లక్షలు, నా భార్య పేరు మీద రూ. 2 లక్షల వరకు అప్పు ఉంది. గత ప్రభుత్వ హయాంలో పహాణీల ప్రకారంగా రూ. లక్ష చొప్పున రుణమాఫీ జరిగింది. రేషన్‌కార్డు నిబంధనతో మాకు రుణ మాఫీ వర్తించలేదు. ప్రభుత్వం స్పందించి రేషన్ కార్డు నిబంధనలను ఎత్తివేయాలి.