హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులది గ్రామీణ నేపథ్యమైనప్పటికీ అంతర్జాతీయ స్థాయిలో ఆలోచించాలని, మహిళలు ఉపాధి వెతికే స్థాయి నుంచి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమశాఖల మంత్రి సీతక పిలుపునిచ్చారు. మహిళల చేతుల్లో కేవలం బ్యాంక్పాస్ బుక్స్ మాత్రమే కాకుండా పరిశ్రమలు, వ్యాపారాలు ఉండాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
మహిళా పారిశ్రామికవేత్తలకు ఆర్థిక, సాంకేతిక, వ్యాపారపరమైన సహకారం అందించేందుకు ఏర్పాటుచేసిన ప్రత్యేక ఇంక్యుబేటర్ కేంద్రాల వెబ్‌సైన్‌ను, బ్రోచర్‌ను సీతక్క బంజారాహిల్స్‌లోని కుమ్రం భీం ఆదివాసీ భవన్లో శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బిట్స్ పిలానీ, టీహబ్ భాగస్వామ్యంతో రెండు ప్రత్యేక ఇంక్యుబేటర్లను ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి ఇంక్యుబేటర్‌కు రూ.10.70 కోట్ల నిధులు కేటాయించామని తెలిపారు. ఈ కేంద్రాల ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలకు శిక్షణ, బ్రాండింగ్, మారెటింగ్, డిజిటల్ సపోర్ట్, ఫైనాన్షియల్ గైడెన్స్, బిజినెస్ మెంటరింగ్ వంటి సేవలు అందించనున్నట్టు చెప్పారు.
300 మంది మహిళా పారిశ్రామికవేత్తలను ఎంపిక చేసి ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వనున్నట్టు తెలిపారు. గ్రామీణ వ్యాపారాలకు ప్రపంచ మారెట్ అవకాశాలు కల్పించడమే ఈ ఇంక్యుబేటర్ల లక్ష్యమని చెప్పారు. తెలంగాణలో ప్రస్తుతం 67 లక్షల స్వయం సహాయక సంఘాల మహిళలు ఉన్నారని, వారు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.