Bollywood News | ప్రముఖ బాలీవుడ్ హాస్యనటుడు రాజ్‌పాల్ యాదవ్ గత కొంతకాలంగా చెక్ బౌన్స్ కేసుల వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న విమర్శలు, ఆర్థిక ఇబ్బందులు మరియు న్యాయపరమైన వివాదాలపై ఆయన స్పందించారు. సినిమా పట్ల తనకు ఉన్న అనుబంధాన్ని, అంకితభావాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బుతో కొలవలేమని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా డబ్బుతో నన్ను ఎవరూ కొనలేరంటూ తేల్చిచెప్పారు.
2013 నుంచి 2016 మధ్య కాలంలో తలెత్తిన సంక్షోభం వల్ల తాను కోట్లల్లో నష్టాన్ని చవిచూశానని ఆయన తెలిపారు. ఈ చట్టపరమైన చిక్కుల కారణంగా తన వృత్తిపరమైన ప్రయాణానికి తీవ్ర విఘాతం కలిగిందని, విదేశాల్లో జరగాల్సిన కనీసం 50కి పైగా పర్యటనలు, టూర్లను కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, అనివార్య పరిస్థితుల వల్ల తన పారితోషికాన్ని కూడా తగ్గించుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. డబ్బు కంటే కళే తనకు ముఖ్యమని చెబుతూ.. తాను కేవలం సినిమా విద్యార్థినని, నటనలో పరిపూర్ణత సాధించడమే తన లక్ష్యమని రాజ్‌పాల్ యాదవ్ అన్నారు. ఎన్ని కష్టాలు, సవాళ్లు ఎదురైనా ప్రేక్షకులు తనపై చూపిస్తున్న ఆదరాభిమానాలు ఎప్పటికీ మారలేదన్నారు. విమానాశ్రయాల్లో ప్రతిసారీ వందలాది మంది అభిమానులు వచ్చి తనతో సెల్ఫీలు దిగడమే ప్రజల నుంచి తనకు లభిస్తున్న నిజమైన ఆదరణకు నిదర్శనమని ఆయన తెలిపారు.
గతంలో నటుడు రాజ్‌పాల్ యాదవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అటా పటా లపట్టా’ (Ata Pata Lapata) సినిమా ఆయన కెరీర్లో ఒక ముఖ్యమైన మైలురాయి. ఈ చిత్రం కోసం ఆయన పెద్దఎత్తున అప్పులు చేసి భారీ వ్యయంతో నిర్మాణ పనులు చేపట్టారు. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో ఆయన తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలోనే తలెత్తిన లావాదేవీల వివాదాలు కోర్టుల వరకు వెళ్లాయి. ఈ విఫల ప్రయత్నం కారణంగా తలెత్తిన ఆర్థిక సమస్యలు చెక్ బౌన్స్ కేసులకు దారితీశాయి. దీనికి సంబంధించి పలు వేర్వేరు చెక్ బౌన్స్ కేసుల్లో దిల్లీ హైకోర్టు రాజ్‌పాల్ యాదవ్‌ను దోషిగా తేల్చింది. ప్రతి కేసుకు సంబంధించి ఫిర్యాదుదారునికి భారీ మొత్తంలో నష్టపరిహారం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.