హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 7: చారిత్రిక రుద్రేశ్వరస్వామి వేయి స్తంభాల దేవాలయంలో ఈనెల 11 నుంచి 20 వరకు దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి డి.అనిల్ కుమార్, ఉత్సవ సమితి అధ్యక్షుడు బత్తిని శ్రీనివాస్ రావు, ఉపాధ్యక్షులు పల్లం రమేష్, ముఖ్యసలహాదారు కోన శ్రీకర్ తవిటి రెడ్డి రవీందర్రెడ్డి, వేయిస్తంభాల దేవాలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆవిష్కరించారు.
ఈ నవరాత్రి మహోత్సవాలు శతచండీ యాగాలు, మహా రుద్రయాగాలు, లక్ష్మీ దుర్గ గణేష్ సరస్వతి దశమహావిద్య మహాయాగం, సుదర్శన యాగం, విశ్వశాంతి లోక కళ్యాణార్ధం విశేషంగా నిర్వహించడానికి ప్రతినిత్యం సాంస్కృతిక కార్యక్రమాలు నిత్య అన్నదాన ప్రసాద వితరణలు, విద్యుత్ అలంకరణ, మహా చండీ హోమాలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి తెలిపారు.
50 మందితో ఉత్సవ సమితి ఏర్పాటు చేశామని, పోలీసు యంత్రాంగం, రెవెన్యూ, మునిసిపల్, దేవదాయ శాఖ తదితరులతో సమన్వయం చేసుకొని ఉత్సవాలు ఘనంగా నిర్వర్తించాలని, విద్యుత్ అలంకరణ ఈ సంవత్సరం మూడు లక్షల రూపాయలతో నగరపాలక సంస్థను ఆదేశిస్తూ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని, దేవాలయం ప్రాంగణంలో ముందు భాగంలో బతుకమ్మకు ఈనెల 10వ తేదీన ప్రారంభమయ్యే బతుకమ్మ పండుగకు లక్షలాదిగా తరలివచ్చే మహిళలకు తాగునీరు సౌకర్యం, టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఎంగిలిపూల బతుకమ్మ 10న జరుపుకోవాలని, 18న సద్దుల బతుకమ్మ జరుపుకోవాలని గంగు ఉపేంద్రశర్మ సూచించారు.ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది మధుకర్, రామకృష్ణ పాల్గొన్నారు.