అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ( Chandra Babu ) , డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఒకరినొకరు పోటాపోటిగా అబద్దాలు ఆడుతున్నారని వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కె రోజా ( RK Roja )సెల్వమణి ఆరోపించారు. బుధవారం నగరిలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో కూటమి పాలనపై విరుచుకుపడ్డారు. రాయలసీమ ( Rayala Seema ) పై చంద్రబాబు కపట ప్రేమను ప్రదర్శిస్తున్నారని విమర్శించారు.
ఇప్పటి వరకు రాయలసీమకు రూ.24 వేల కోట్ల విలువ గల ప్రాజెక్టులు తీసుకొచ్చామని గొప్పలు చెప్పుకోవడమే తప్పా అవి ఎక్కడ ఉన్నాయో వెల్లడించాలని డిమాండ్ చేశారు. రాయలసీమ అభివృద్ధి, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కూటమి ప్రభుత్వం చెబుతున్న మాటలకు, క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన లేదని ఆరోపించారు.రాయలసీమ పట్ల చిత్తశుద్ధి ఉంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్మిస్తామని ప్రకటించాలని కోరారు.
చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొంటున్నాయని ‘కరువు, చంద్రబాబు కవల పిల్లలు’ అని విమర్శించారు. రైజింగ్ రాయలసీమ పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కుప్పానికి, పిఠాపురానికి కూడా నీళ్లు ఇవ్వలేని వారు రాయలసీమ అభివృద్ధి గురించి పెద్ద మాటలు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. మాటలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో చేసిన పనులను ప్రజల ముందు ఉంచాలని ఆమె అన్నారు.