Farmer | విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం రైతన్నల పాలిట యమపాశంలా మారుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడో ఒక చోట తరచూ విద్యుత్ షాక్‌కు గురై అన్నదాతలు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. తెల్లవారుజామున పొలం బాట పట్టిన రైతును తెగిపడిన విద్యుత్ వైర్లు బలిగొన్న విషాద ఘటన రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలంలో చోటుచేసుకుంది. దేవునిబండ తండాకు చెందిన మూడవత్ బాలు (42) విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. ఈ ఘటనతో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.
బుధవారం తెల్లవారుజామున సుమారు 5 గంటల సమయంలో బాలు తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లాడు. వరి చేనులోకి నడుచుకుంటూ వెళ్తుండగా పొలంలో తెగిపడి ఉన్న విద్యుత్ తీగలు అతని కాళ్లకు తగిలినట్లు సమాచారం. దీంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్‌కు గురైన బాలు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఉదయం వేళ పొలానికి వెళ్లిన రైతు విగతజీవిగా కనిపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అప్పటికే బాలు మృతి చెందినట్లు గుర్తించారు.
పంటను కాపాడుకునేందుకు తెల్లవారుజామునే పొలానికి వెళ్లిన రైతు తిరిగి ఇంటికి చేరకుండానే మృత్యువాత పడటంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న కుటుంబానికి ఈ ఘటన తీరని లోటుగా మారింది.
వ్యవసాయ పొలాల మీదుగా వెళ్లే విద్యుత్ లైన్ల విషయంలో అప్రమత్తత అవసరమని స్థానికులు పేర్కొంటున్నారు. తీగలు తెగిపడిన వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేసి మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉందని అంటున్నారు. పొలాల్లోకి రైతులకు ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా విద్యుత్ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించాలని కోరుతున్నారు. రైతు ప్రాణాన్ని బలిగొన్న విద్యుత్ తీగల ఘటనపై అధికారులు స్పందించి, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
కరెంటు ఇవ్వకుండా రైతులను గోస పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం : సుంకె రవిశంకర్
Kushitha Kallapu | నిషా కళ్లతో మత్తెక్కిస్తున్న కుషిత.. రెడ్ శారీలో అదిరిపోయే లుక్!
Dhurandhar The Revenge | థియేటర్లలో దుమ్మురేపిన ‘ధురంధర్’.. టీవీలో ఎప్పుడు ప్రసారం కానుంది అంటే..!