గంగాధర, అక్టోబర్ 7 : కరెంటు ఇవ్వకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్నదాతలను కడగండ్ల పాలు చేస్తోందని, తీవ్రమైన కరెంటు కోతలతో సాగు చేసిన పంట పొలాలు ఎండిపోతున్నాయని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిన మాటలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిజం చేస్తుందన్నారు. నిత్యం కరెంటు కోతలను నిరసిస్త కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో కరీంనగర్ జగిత్యాల జాతీయ రహదారిపై బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కొత్త జయపాల్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, రైతులతో కలిసి ధర్నా రాస్తారోకోలో మాజీ ఎమ్మెల్యే పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు నాణ్యమైన 24 గంటల కరెంటు ఇచ్చి రైతులు ఇబ్బంది పడకుండా చేసిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వ్యవసాయానికి కనీసం 6 గంటలు కూడా విద్యుత్ సరఫరా చేయడం లేదని మండిపడ్డారు. లో వోల్టేజీతో కరెంటు మోటార్లు కాలిపోతున్నాయని, పొట్ట దశలో ఉన్న పంట పొలాలకు సాగు నీరు అందక ఎండిపోతున్నాయని విమర్శించారు. తీవ్రమైన కరెంటు కోతలతో పంటలు ఎండిపోతుంటే ఆవేదనతో పంట పొలాలకు రైతులు నిప్పు పెడుతున్నారని పేర్కొన్నారు.
రైతుల ఆవేదనను చూసి కూడా ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. ప్రభుత్వం స్పందించి వ్యవసాయానికి 12 గంటలు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలని, లేదంటే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. పోలీసులు వారిని అదుపులోకి గంగాధర పోలీస్ స్టేషన్ కు తరలించారు. కార్యక్రమంలో నాయకులు సాగి మహిపాల్ రావు, మేచినేని నవీన్ రావు, కంకణాల విజయేందర్ రెడ్డి, గంట్ల జితేందర్ రెడ్డి, ద్యావ మధుసూదన్ రెడ్డి, నాగి శేఖర్, చిలుక రవీందర్, కత్తెరపాక కొండయ్య, జనగం శ్రీనివాస్, గంటల వెంకట్ రెడ్డి, వేముల దామోదర్, రామిడి సురేందర్, దూలం శంకర్ గౌడ్, ముక్కెర మల్లేశం, పుట్కం రవీంద్రనాథ్ ఠాగూర్,గడ్డం స్వామి, గుడిసె తిరుపతి, సముద్రాల అజయ్, మామిడిపల్లి అఖిల్, జుర్రు రవి, సముద్రాల ఓంకార్, గుంటుకు జితేందర్ తదితరులు పాల్గొన్నారు.