దుండిగల్, ఫిబ్రవరి 16: నేటి విద్యార్థులే రేపటి దేశాభివృద్ధికి ఉపయోగపడే మానవవనరులని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బౌరంపేట (బాచుపల్లి)లోని కేఎల్ యూనివర్శిటీ (కేఎల్యూ)లో ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆ వర్సిటీ యాజమాన్యం అందించే రూ.100 కోట్ల మెరిట్ స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడం హర్షణీయమని తెలిపారు. కేఎల్యూ విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు అద్భుతమైన ప్లేస్మెంట్లను అందిస్తున్నదని అభినందించారు. అనంతరం ఆమె వర్సిటీలో మౌలిక వసతులను, పరిశోధనా కేంద్రాలను పరిశీలించారు. అంతకుముందు కేఎల్యూ క్యాంపస్లలో పీజీ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించిన ‘కేఎల్ మాట్-2024’ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. కార్యక్రమంలో కేఎల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ కార్యదర్శి కోనేరు కాంచనలత, వర్సిటీ వైస్-చాన్స్లర్ డాక్టర్ ఎన్ వెంకట్రామ్, అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జే శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.