హైదరాబాద్, మార్చి 17 ( నమస్తే తెలంగాణ) : శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు చెప్తున్న సమాధానాలు తీవ్రమైన చర్చకు దారితీస్తున్నాయి. పొంతనలేని జవాబులు చెప్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు సభ జరుగుతున్న సమయంలోనే మరోవైపు సోషల్ మీడియాలో నెటిజన్లు, తెలంగాణవాదులు వ్యంగ్యాస్ర్తాలు సంధిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎవరైనా మాట్లాడుతున్నారంటే చాలు, మళ్లీ ఆణిముత్యం లాంటి వ్యాఖ్య ఏదో రాబోతున్నదంటూ కొందరు ఎద్దేవా చేస్తున్నారు. అలాంటిదే మరో ఘటన సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఆవిష్కృతమైంది. కాంగ్రెస్ హయాంలో ఇప్పటివరకు మొత్తం 1,110 మందిని విదేశీవిద్యా పథకానికి ఎంపికచేసినట్టు మంత్రి సీతక్క చెప్పుకొచ్చారు. నిన్న(16న) ఆదివారం కాబట్టి, వెబ్సైట్లో అప్డేట్ చేయలేదని పేర్కొన్నారు. విదేశీవిద్యా స్కాలర్షిప్ల కింద రూ.167 కోట్లు చెల్లించామని, రూ.25 కోట్లు ఇవ్వాల్సి ఉందని, వాటిని త్వరలో చెల్లిస్తామని తెలిపారు. మంత్రి చెప్పే మాటలు నిజమైతే ఆ విద్యార్థుల జాబితాను వెల్లడించాలని ఎమ్మెల్యే గంగుల డిమాండ్ చేశారు. కానీ, ఆదివారం వెబ్సైట్ పనిచేయకపోవడం ఏంటని, మంత్రి అలా ఎందుకు చెప్పారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఏడాది నుంచి లబ్ధిదారుల వివరాలేవీ వెబ్సైట్లో లేకపోతే, మంత్రి మాత్రం ఆదివారాన్ని సాకుగా చూపుతున్నారని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
అంతకుముందు ప్రశ్నోత్తరాల సమయంలో గంగుల కమలాకర్ మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో పేద, బడుగు, బలహీనవర్గాల విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన విదేశీ విద్యాపథకంపై కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ 15 నెలల పాలనలో ఒక్కరిని కూడా ఎంపికచేయలేదని, ప్రభుత్వ వెబ్సైట్లో వివరాలే ఇందుకు నిదర్శనమని స్పష్టంచేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఏటా రెండు విడతల్లో 300మంది విద్యార్థులను విదేశీ విద్యకు పంపిందని, ఎనిమిదేండ్లలో రూ.1,000 కోట్లు ఖర్చుచేసి 6,700మంది విద్యార్థ్ధులకు విదేశీవిద్యను అందించిందని గుర్తుచేశారు. బలహీనవర్గాల పిల్లలు ఐఐటీల్లో చదువుకోవాలనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించారని తెలిపారు. గంగుల ప్రశ్నకు మంత్రి సీతక్క సమాధానమిస్తూ, ఈ పథకాన్ని ఎత్తివేయలేదని తెలిపారు.