Minister Seethakka | మేడారం మహాజాతర సందర్భంగా లక్షలాది మంది భక్తులు మొక్కుల చెల్లింపుల కోసం తరలివస్తుంటారని మంత్రి సీతక్క అన్నారు. కాబట్టి వీఐపీల కోసం మేడారం వీఐపీ, వీవీఐపీ పాసులను పలారం పంచినట్లుగా పంచలేమని తెలిపారు. వీఐపీలు స్పెషల్‌గా వస్తే గొప్పదనం కాదని.. పబ్లిక్‌గా వస్తేనే గొప్పదనం ఉంటుందని అభిప్రాయపడ్డారు.
లక్షల పాసులు కొట్టిస్తే సాధారణ భక్తులు ఎలా దర్శనం చేసుకుంటారనే విషయాన్ని ఆలోచిస్తున్నామని సీతక్క తెలిపారు. అందుకే అసలు జాతరలో పాసుల విధానాన్ని రద్దు చేసేందుకు ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నారు. పాసుల జారీ విషయంలో స్థానిక, స్థానికేతర ప్రజాప్రతినిధులను గౌరవించి, ఇప్పటికే పాసులు జారీ చేశామన్నారు. అధికంగా పాసుల కోసం అధికారులు, ప్రజాప్రతినిధులను ఒత్తిడి చేయవద్దని, వీఐపీలు క్రమశిక్షణగా వ్యవహరించాలని సూచించారు. సాధారణ భక్తుల కోసం వీఐపీలు సైతం పునరాలోచన చేయాలన్నారు.
రేపటి నుంచి సమ్మక్క సారలమ్మ గద్దెల మీదకు భక్తులను అనుమతించేది లేదని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. క్యూలైన్ల ద్వారా దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ప్రతి భక్తుడు క్రమశిక్షణగా స్వీయ నియంత్రణ పాటించి, క్యూలైన్ల ద్వారా వస్తేనే బాగుంటుందని సూచించారు.