Minister Seethakka | బన్సీలాల్‌పేట్, సెప్టెంబర్ 5 : ఆటోడ్రైవర్ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆదివాసి మహిళను గాంధీ దవాఖానలో గురువారం పరామర్శించేందుకు వచ్చిన మంత్రి సీతక్కకు మహిళల నుంచి నిరసన సెగ తగిలింది. బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి, కార్యకర్తలు, మహిళలు గాంధీ ప్రధాన ద్వారం వద్ద నిరసన తెలిపారు.ఆదివాసీ మహిళకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు జోక్యంతో మంత్రి బాధితురాలిని పరామర్శించారు.
జైనూరు ఘటనకు మతం రంగు పులుమొద్దని మంత్రి సీతక్క హితవు పలికారు. నిందితుడిని ఉరితీయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేయడాన్ని ఆమె తప్పుపట్టారు. లైంగిక దాడి నిందితులను ఉరి తీసేలా కేంద్రం చట్టం చేస్తే అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని స్పష్టం చేశారు. అలాంటి చట్టాన్ని బీజేపీ నేతలు తీసుకురాగలరా? అని మంత్రి సవాల్ చేశారు. నిందితుడికి కఠిన శిక్షణ పడేవరకు ప్రభుత్వం వదిలిపెట్టదని చెప్పారు. బాధితురాలి కుటుంబ సభ్యులకు గిరిజన సంక్షేమ శాఖ తరఫున రూ.లక్ష చెకు అందచేశారు.
జైనూర్‌లో ఓ వర్గం యథేచ్ఛగా దాడులు చేస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోని అసమర్థ సర్కారు ఇది అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. గురువారం రాత్రి గాంధీ దవాఖానలో బాధితురాలిని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడు తూ ఆదివాసీమహిళపై జరిగిన దాడిని చూస్తే మా నవత్వం ఉన్నవారెవరూ తట్టుకోలేరని చెప్పారు. ప్రభుత్వం లక్ష ఇచ్చి చేతులు దులుపుకోవడం ఏం బాగోలేదని విమర్శించారు. మతపరమైన ఘటనగా చూడకుండా మానవత్వంతో మహిళకు జరిగిన అన్యాయంగా చూడాలని చెప్పారు.
జైనూర్‌లో గిరిజనులపై దాడులు పెరిగినా ప్రభుత్వం చోద్యం చూస్తున్నదని బీజేపీ శాసనసభ పక్షనేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. ఘటనపై ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని నిలదీశారు. గాంధీలో బాధితురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఘటన జరిగి ఇప్పటికే ఐదు రోజులైందని, ఆమెపై లైంగికదాడి జరగినట్టు వైద్యులు నిర్ధారణ చేయకపోవడం అనేక అనుమానాలకు దారి తీస్తున్నదని చెప్పారు.
ఆసిఫాబాద్ టౌన్/ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, సెప్టెంబర్ 5 : మహిళల రక్షణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి మండిపడ్డారు. జైనూర్ వెళ్తుండగా కెరమెరి ఘాట్ వద్ద ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులపై ఆమె తీవ్ర ఆగ్రహం చేసి ఆసిఫాబాద్‌లోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. ఆదివాసీ మహిళపై జరిగిన అఘాయిత్య యత్నానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, నిందితుడికి యావజ్జీవ శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత మహిళను పరామర్శించి, ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరినట్టు తెలిపారు.