హైదరాబాద్, మే 17(నమస్తే తెలంగాణ): ములుగు నియోజకవర్గంలో గోదావరి నదిపై లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు(ఎత్తిపోతలు) నిర్మించి రైతులకు సాగునీరు అందించాలని సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క కోరారు. బంజారాహిల్స్‌లోని ఉత్తమ్ నివాసంలో శనివారం ఆయనను కలిశారు.
రామప్ప, లక్నవరం, పాకాల చెరువులతోపాటు ములుగు నియోజకవర్గం గుండా 100 కిలోమీటర్ల మేర గోదావరి పారుతున్నా స్థానిక రైతాంగానికి జలాలు అందడం లేదని ఈ సందర్భంగా వివరించారు. రామప్ప-లక్నవరం కెనాల్ నిర్మాణానికి అదనపు నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రతిపాదిత ప్రాజెక్టుల నిర్మాణం చేపడతామని ఉత్తమ్ హామీ ఇవ్వగా మంత్రి సీతక కృతజ్ఞతలు తెలిపారు.
పనుల పురోగతిపై సమీక్ష..
ములుగు నియోజకవర్గానికి సం బంధించి ఏజెన్సీ ప్రాంతాల్లో నూతన రోడ్లు, ప్రభుత్వ భవనాల నిర్మాణం, పెండింగ్ పనులు, పనుల పురోగతిపై మంత్రి సీతక శనివారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. అటవీ చట్టాలకు లోబడి త్వరితగతిన పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.