జయశంకర్భూపాలపల్లి : గతంలో కాంగ్రెస్ వాళ్లు ఇచ్చే కరెంట్ సరిపోతలేదని ధర్నా చేసిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ రోజు 3గంటల విద్యుత్ చాలు అనడం సిగ్గు చేటని గిరిజన సంక్షేమ శాఖమంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్ అయ్యారు. జిల్లాలోని గోరికొత్తపల్లి మండలం చెన్నపూర్ గ్రామంలో రూ.166 లక్షలతో రామగుండాల పల్లి నుంచి చెంచు పల్లి గ్రామాల మధ్య నూతన బీటీ రోడ్డు నిర్మాణ పనులకు, రూ. 150 లక్షలతో నూతన సబ్ స్టేషన్ నిర్మాణాలకు శంకుస్థాపన చేసి మాట్లాడారు.
ఒకే రోజు దాదాపు రూ.3కోట్ల పై చిలుకు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం చాలా సంతోషం. భూపాలపల్లి నియోజకవర్గంలో మీరు ఒకరికి ఓటు వేస్తే ముగ్గురు పనిచేస్తున్నారని మంత్రి తెలిపారు. నియోజకవర్గ రోడ్లకు మా శాఖ నుంచి 10కోట్ల రూపాయల నిధులను కేటాయించాం. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అమెరికా పోయి రైతులకు కేసీఆర్ అనవసరంగా 24గంటల విద్యుత్ ఇస్తున్నారు అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూన్నారని మండిపడ్డారు.
టీడీపీ హయాంలో రేవంత్ ఉన్నప్పుడు అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కరెంట్ 6నుంచి 9 గంటలు మాత్రమే. తెలంగాణ వస్తే కరెంట్ తీగలపై బట్టలు వేసుకోవడమే అని నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి శాపనార్థం పెడితే ..తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి సంవత్సరంలో నాణ్యమైన 24 గంటకు విద్యుత్ అందించిన ఘనత కేసీఆర్‌ది అని స్పష్టం చేశారు. అధికారంలోకి రావడానికి అనవసరపు వాగ్దానాలు చేస్తున్న పార్టీల నాయకులను ప్రజలు ప్రశ్నించాలన్నారు. మీరు అధికారంలో ఉన్న రాష్ట్రల్లో అమలు చేయని సంక్షేమ పథకాలు తెలంగాణలో ఎలా చేస్తారని ప్రశ్నించారు. భూపాలపల్లి నియోజకవర్గాన్ని స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణ రెడ్డి గారు దాదాపు 100కోట్ల అభివృద్ధి చేశారు.
ఈ కార్యక్రంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ శ్రీ బండ ప్రకాశ్ ముదిరాజ్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి , జిల్లా కలెక్టర్ భావేశ్ మిశ్రా, ఎస్పీ సురేందర్ రెడ్డి, ఎంపీపీ పున్నం లక్ష్మి, జడ్పీటీసీ సాయిని విజయ, జిల్లా రైతుబంధు కో ఆర్డినేటర్ హింగే మహేందర్, మండల పార్టీ అధ్యక్షుడు మటిక సంతోష్, స్థానిక సర్పంచ్ ఎంపీటీసీలు ప్రణతి, కవిత, జిల్లా సోషల్ మీడియా ఇంచార్జ్ రవి సామ్రాట్, జడ్పీ కో ఆప్షన్ సభ్యులు రహీం పాషా తదితరులు పాల్గొన్నారు.