హైదరాబాద్, ఫిబ్రవరి 9(నమస్తే తెలంగాణ): మహిళా సంక్షేమంలో దేశానికి తెలంగాణ రోల్‌మాడల్‌గా నిలిచిందని మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. మహిళల గోస, కష్టాలను తీర్చిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని స్పష్టం చేశారు. ఆడ పిల్ల పుట్టింది మొదలు.. ఆమె బిడ్డకు తల్లయ్యే వరకు ప్రభుత్వం అండగా ఉంటూ భరోసా ఇస్తున్నదని వివరించారు. గురువారం అసెంబ్లీలో మహిళాశిశు సంక్షేమ శాఖ పద్దుపై చర్చ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్ప్రభుత్వం మహిళ, శిశు సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని తెలిపారు. నిరుడు ఈ శాఖకు రూ.1,829 కోట్లు కేటాయించగా, ఈసారి దాన్ని రూ.1,977 కోట్లకు పెంచారని వెల్లడించారు. మహిళల భద్రత కోసం రూ.1,527 కోట్లు కేటాయించినట్టు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేస్తామని మంత్రి ప్రకటించారు.
మహిళా ఆరోగ్యానికి ఆరోగ్యలక్ష్మి
మహిళల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఆరోగ్యలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నదని, ఈ బడ్జెట్లో రూ.296 కోట్లు ఇచ్చిందని మంత్రి తెలిపారు. ఈ పథకానికి కేంద్రం నిధులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. దీనిపై కేంద్రమంత్రిని అడిగితే ‘మీ రాష్ట్రం ఇష్టం.. పెంచుకుంటే మీరే పెంచుకోండి’ అని నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ న్యూట్రిషన్ అమలు కోసం సీఎం రూ.200 కోట్లు కేటాయించారని వెల్లడించారు.
అనాథలకు ప్రభుత్వమే అన్నీ తానై..
తల్లిదండ్రులు లేనివారికి ప్రభుత్వమే అండగా నిలబడి అవసరమైన సౌకర్యాలను కల్పిస్తున్నదని మంత్రి తెలిపారు. అనాథ పిల్ల ల కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న శిశు విహార్ దేశానికి రోల్‌మాడల్ అని కేంద్రమే ప్రశంసించినట్టు గుర్తుచేశారు. బాలామృతం ప్లస్‌ను ఈ ఏడాది నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నట్టు వెల్లడించారు. అంగవైకల్యం ఉన్నవారిని పెండ్లి చేసుకుంటే ఇచ్చే ప్రోత్సాహకం రూ.1,00,116ను రూ.2 లక్షలకు పెంచినట్టు తెలిపారు. వ్యాపారం కోసం మరో లక్ష రుణం ఇస్తున్నట్టు పేర్కొన్నారు.
తెలంగాణలో ‘గిరి’వికాసం
తెలంగాణలో గిరిజనుల వికాసం నడుస్తున్నదని సత్యవతి తెలిపారు. త్వరలోనే గిరిజన బంధు వస్తుందని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని వెల్లడించారు. 2023-24 బడ్జెట్లో ఎస్టీ సంక్షేమం కోసం రూ.14,380 కోట్లు కేటాయించామని అన్నారు. గత ఏడాది కంటే రూ.వెయ్యి కోట్లు ఎక్కువ కేటాయించామని తెలిపారు. 1,682 గిరిజన ఆవాసాలకు రూ.1,276 కోట్లతో బీటీ లింక్ రోడ్లు, 3,467 గిరిజన ఆవాసాలకు రూ.221 కోట్లతో 3-ఫేజ్ విద్యుత్తు సౌకర్యం కల్పించినట్టు వెల్లడించారు. గిరివికాసం పథకం కింద 2023-24లో 15వేల మంది గిరిజన రైతుల ప్రయోజనాల కోసం రూ.150 కోట్లు ప్రతిపాదించామని తెలిపారు. త్వరలోనే అర్హులందరికీ పోడు పట్టాలు అందజేస్తామని చెప్పారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించేందుకు బీజేపీ కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. గిరిజన జాతిలో పుట్టి పెరిగిన బీజేపీకి చెందిన ఎంపీ కొందరిని పక్కన పెట్టుకొని తరచూ ఢిల్లీ వెళ్తున్నారని మండిపడ్డారు. ట్రైబల్ యూనివర్సిటీ కోసం కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీలు ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు.